ఖలీల్‌వాడి/ కంఠేశ్వర్, ఫిబ్రవరి 10:కొంగొత్త వాహనాల జోరు. బ్యాటరీ వెహికిల్స్ సందడి. కట్టిపడేసే ఫీచర్స్‌తో ఆకట్టుకునే కార్లు. నేటితరం యువతను మంత్రముగ్ధులను చేసే బైకులు.. ఒకటేమిటి పదుల సంఖ్యలో కొలువైన వాహనాలతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే – ఆటో షో అదిరిపోయింది. రయ్… రయ్ మంటూ ట్రయల్ రన్లతో కుర్రకారు, ఔత్సాహికులు తమ సంబురాన్ని తీర్చుకున్నారు.
ఆటోషో అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చేది మహానగరాలు మాత్రమే. అలాంటిది నిజామాబాద్ వంటి నగరాలకు సైతం ఒకేచోటికి ఆటోమొబైల్ కంపెనీలను తీసుకురావడంపై స్థానిక ప్రజానీకం నుంచి మంచి స్పందన వస్తున్నది. కొత్త కారును కొనుగోలు చేయాలంటే రోజంతా సమయం పడుతుందని, ఆటో షో వంటి కార్యక్రమాలతో పదుల మోడల్స్ కార్లను ఒకే రోజులో పరిశీలించే అవకాశాన్ని నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే కల్పించింది. 2021లో తొలిసారి ఆటో షో నిర్వహించగా 2022లో రెండో ఎడిషన్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇప్పుడు 2024లో ముచ్చటగా మూడోసారి ఆటో షో నిర్వహించగా 25స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రుణ సదుపాయానికి బ్యాంకర్లు సైతం స్టాళ్లను ఏర్పాటు చేశారు. తొలిరోజు ఆటోషోను సందర్శించిన వారంతా సంతోషం వ్యక్తంచేశారు. దిగువ, మధ్యతరగతి వర్గాలు మెచ్చే స్కూటర్లు, బైకులు, బ్యాటరీ ఆధారిత వాహనాలు సైతం వివిధ కంపెనీల స్టాళ్లలో మెప్పిస్తున్నాయి. సంపన్న వర్గాలను ఆకర్షించే మెర్సిడెజ్ బెంజ్, ఆడి, వోల్వో వంటి ప్రీమియం కార్లు సైతం తళుక్కుమనగా.. మధ్య తరగతి వర్గాలను సంతృప్తి పరిచే ధరల్లో పెట్రోల్, డీజిల్, బ్యాటరీ కార్లు సైతం ఆటో షోలో ప్రదర్శించారు. ఆటో షోలో రూ.లక్షతో మొదలయ్యే బైకుల నుంచి మొదలుకొని కోటి రూపాయలకు పైగా ధర పలికే వాహనాలు విభిన్న మోడళ్లలో అందుబాటులో ఉండడం విశేషం.
ప్రారంభించిన జడ్పీ చైర్మన్, మేయర్..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన ఆటో షో కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాన్ని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్, సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అశ్వంత్ కుమార్, ఎంవీఐ కిరణ్, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్ రావు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 25 స్టాళ్లను కలియ తిరుగుతూ వాహనాలను పరిశీలించి, వివిధ స్టాళ్లలో ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్, ఇతరత్ర వాహనాల వివరాలను ఎక్కువ మంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. సందర్శకుల్లో మహిళలు, పురుషులు, యువతతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారంతా వచ్చి తిలకించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాల్లో వాహనాలకు దక్కుతున్న రుణాలు, వాటి వడ్డీ రేట్లకు సంబంధించిన వివరాలను బ్యాంకు సిబ్బంది ఔత్సాహికులకు వివరించారు. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షోలో బుక్ చేసుకున్న వెహికిల్‌కు 24గంటల్లోనే రుణం మంజూరు చేస్తామని ప్రకటించారు.
తళుక్కుమన్న కోటి రూపాయల వాహనాలు…
ఆటో షో ప్రారంభ సమయం నుంచి సందర్శకులు తరలి రావడంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. భారీగా తరలి వచ్చిన విజిటర్లతో బ్యాంకర్లు, ఆటో మొబైల్ కంపెనీల డీలర్ల మధ్య విక్రయాలకు సంబంధించిన చర్చలు జోరుగా సాగాయి. సాయంకాల సమయంలో కుటుంబ సమేతంగా చాలా మంది ఆటో షోకు హాజరై తమ ఆకాంక్షలకు తగిన వాహనాల ఎంపికలో బిజీగా గడిపారు. ప్రీమియం వెహికిల్స్ స్టాల్స్‌లో కోటి రూపాయలకు పైగా ధర పలికే బెంజ్, ఆడి కార్ల వద్ద అత్యధికులు ఫొటోలు దిగారు. కట్టిపడేసే వోల్వో కారు సైతం చూపరులను ఆకర్షించింది. సన్రైస్ కియా, మహవీర్ గ్రూప్ – మెర్సిడెజ్ బెంజ్, హోండా, వోల్వో, ఆడి హైదరాబాద్, ఎంజీ, సిట్రాన్ ప్రైడ్ మోటర్స్, ప్రైడ్ జీప్, పీపీఎస్ మోటర్స్-వోక్స్ వాగన్, లక్ష్మీ టీవీఎస్, లక్ష్మీ నిసాన్, వెంకటేశ్వర హీరో, వరుణ్ మోటర్స్, ట్రూ వ్యాల్యూ – వరుణ్ మోటర్స్, సాయిరాం హోండా, ప్రకాశ్ హృందాయ్, ఆటోమోటివ్(జనరల్), నెక్సా మారుతి సుజుకి, చెతక్ – విజయ గణపతి ఆటోమోవ్స్, మహీంద్రా ఆటోమోటివ్స్(కమర్షియల్), టాటా మోటర్స్ – శ్రీ వెంకటేశ్వర, మారుతి సుజుకీ – వరుణ్ మోటర్స్(కమర్షియల్), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాళ్లు ఏర్పాటయ్యాయి. కార్యక్రమంలో యూబీఐ రీజినల్ హెడ్ శంకర్ హెంబ్రమ్, నమస్తే తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు.
నేడూ కొనసాగనున్న ఆటో షో
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో సోమవారం ప్రారంభించిన ఆటో షోకు విశేష స్పందన లభిస్తోంది. ఆటో షోలో 25 స్టాళ్లు ఏర్పాటు చేయ గా.. తమ ఆకాంక్షలు, అభిరుచికి తగిన వాహనాలను ప్రదర్శనలో ఉంచారు. ఉద యం నుంచి రాత్రి వరకు సందర్శకుల తాకిడి నెలకొంది. ఆటో షో ఆదివారం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగనున్నది.
కియా బంపర్ ఆఫర్..
ఈ ఆటో షోలో కియాలో పేరొందిన ఉత్పత్తి సెల్టాస్ వాహనాన్ని బుక్ చేసుకుంటే దంపతులకు విదేశీ ట్రిప్‌ను ఉచితంగా అందిస్తామని సన్‌రైజ్ కియా మేనేజింగ్ డైరెక్టర్ రవి కిరణ్ గౌడ్ చెప్పారు. నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆటో షో వేదికగా ఈ ఆఫర్‌ను ఆయన వెల్లడించారు. ఇలాంటి తరహా బంపర్ ఆఫర్ కియా వాహనాలపై మరెక్కడా లేదన్నారు. సంస్థ అనుమతితో నిజామాబాద్‌లో తొలిసారిగా అమలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
వాహన ప్రియులకు చక్కని వేదిక
కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షో చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. నిజామాబాద్ వంటి నగరాల్లో ఇంత భారీ ఏర్పాట్లతో వాహన ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా బాగున్నది. కాలుష్యరహిత వాహనాలకు క్రేజ్ పెరుగుతున్న సమయంలో అలాంటి వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మంచి పరిణామం.
– దాదన్నగారి విఠల్ రావు, జడ్పీ చైర్మన్, నిజామాబాద్
కాన్సెప్ట్ ఆకట్టుకుంటున్నది..
ఆటో షోతో నగర ప్రజలకు ఎంతో లాభం. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిజామాబాద్‌కే పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు వచ్చి తమ ఉత్పత్తులు ప్రదర్శించడం ద్వారా ప్రజలకు దూర భారం, రవాణా ఖర్చు తప్పుతుంది. వాహనాలు కొనడం ఎంత ముఖ్యమో ట్రాఫిక్ రూల్స్ పాటించడం, వాహనాలను జాగ్రత్తగా నడపడం అంతే ముఖ్యం.
– దండు నీతూ కిరణ్, నగర మేయర్
ఆటోషో చాలా బాగున్నది
ఆటోషో చాలా బాగున్నది. ఇక్కడ అన్ని రకాల బైక్‌లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాహనాలు సైతం అందుబాటులో ఉంచారు. షోరూంల చుట్టూ తిరిగే పనిలేకుండా తక్కువ సమయంలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆయా కంపెనీలకు చెందిన స్కూటీలను పరిశీలించిన.
– రేణుక, గాంధారి
ఒకే వేదికపై అన్నిరకాల వాహనాలు
కార్లు, బైకులు, స్కూటీలు ఒకే వేదికపై ఏర్పాటు చేయడం బాగున్నది. దీంతో వాహనాలను కొనుగోలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మధ్య తరగతి కుటుంబాలు, ఉద్యోగులు రుణ సౌకర్యంతో వాహనాలు కొనుగోలు చేసేందుకు బ్యాంకువారు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇంత చక్కని వేదికను ఏర్పాటు చేసిన నమస్తేతెలంగాణ-తెలంగాణ టుడేకు ధన్యవాదాలు.
– పూజ, మోస్రా
కొత్తకొత్త మోడళ్లు ఉన్నాయి..
ఆటోషో చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ కొత్తకొత్త మోడళ్లు ఉన్నాయి. అన్ని కంపెనీలకు చెందిన కార్లు అందుబాటులో ఉంచారు. సమయం ఆదాతోపాటు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకునే సౌకర్యం కల్పించింది.
– నివేదిత,
నిజామాబాద్ జిల్లాకు బ్రాండెడ్ కార్లు వస్తున్నాయి..
నిజామాబాద్ జిల్లాకు బ్రాండెడ్ కంపెనీలు రావడం సంతోషంగా ఉన్నది. హైదరాబాద్‌కు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు చేసేలా అందుబాటులోకి తీసుకువచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రయత్నం అభినందనీయం. బెంజ్, ఆడి, వొల్వో కార్ల కంపెనీలు రావడం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇలాంటి ఆటోషోలతో ప్రజలు వాహనాలను సులువుగా కొనుగోలు చేయడానికి వీలుంటుంది.
– డాక్టర్ రాజేశ్వర్, నిజామాబాద్