మోర్తాడ్, ఆగస్టు 7: బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వైఖరిపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల అంకాపూర్‌కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్..రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి నాలుగు పాదాల మీద నడుస్తుందని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఈప్రాంతంలో అభివృద్ధి చేసింది ఏమీలేదన్నారు. అసలు వారు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక గుడ్డిగా మాట్లాడుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్న పనులు కూడా గతంలో వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో మంజూరైనవేనని గుర్తు చేశారు. భీమ్‌గల్‌లో వంద పడకల దవాఖానకు ప్రశాంత్‌రెడ్డి రూ.35కోట్ల నిధులు మంజూరు చేయించి సుమారు 75శాతం పనులు పూర్తి చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడేండ్లకు గాను కేవలం రూ.3కోట్లు కేటాయించి తామేదో సాధించినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
అభివృద్ధిని విస్మరించి బురదజల్లే ప్రయత్నం
లింబాద్రిగుట్టను ప్రశాంత్‌రెడ్డి, సిద్ధుల గుట్టను జీవన్‌రెడ్డి ఎంతగొప్పగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు రైతుబంధు, కల్యాణలక్ష్మి కింద తులంబంగారం, సరిపడా విద్యుత్, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వడం చేతకాదని మండిపడ్డారు. ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు కాబట్టే వేములపై రాయివేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేముల ప్రశాంత్‌రెడ్డి సుమారు 1100 డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారని గుర్తుచేశారు. కానీ నేడు కాంగ్రె స్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లను కూరగాయ లు పంచుకున్నట్లు తమ సొంత పార్టీ కార్యకర్తలకు పంచుకోవడానికి కొట్టుకుంటున్నారని విమర్శించారు.
‘పునరుజ్జీవం’ ఘనత వేములదే
ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకాన్ని ఏర్పా టు చేసి కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీకి మళ్లించి ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా మార్చిన ఘనత ప్రశాంత్‌రెడ్డిదే అనే విషయం ఇక్కడి రైతాంగం గుర్తించిందని పేర్కొన్నారు.
ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు డిఫాక్టో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష సర్పంచులు, ప్రజాప్రతినిధులను గౌరవించకుండా అవమానిస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా నిజమైన అభివృద్ధి చేసి చూపించాలని సూచించారు. అబద్ధపు ప్రచారాలు, బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని రాజారామ్ యాదవ్ హెచ్చరించారు.