ఖలీల్వాడి/ ఆర్మూర్ టౌన్/ బాల్కొండ, మే 16: అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిన్నమొన్నటి వరకు వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామని ప్రకటించి రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు వారు కాంగ్రెస్ రైతువ్యతిరేక నిర్ణయాలపై జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసనలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టగా.. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్తో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొన్నటి వరకు బోనస్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మళ్లీ మాట మారి సన్న బియ్యనికే బోనస్ ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నెలల తరబడి ఉంటున్నా.. ఎందుకుకొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు గాండ్ల లింగం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నీలగిరి రాజు, తెలంగాణ శంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ కట్టపై, బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
ఆర్మూర్లో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తానని ఎన్నికల ముందు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ నెరవేరలేదని అన్నారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరుణ, సుంకరి రవి, నవీన్, గుజ్జెటి పృథ్విరాజ్, రంజిత్, అగ్గు క్రాంతి, శీను, గంగాధర్, మీరా శ్రవణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.