బోధన్ /మోర్తాడ్/ భీమ్‌గల్/ ఆర్మూర్‌టౌన్/ ఆలూర్/బోధన్ రూరల్/ రెంజల్/ ఖలీల్‌వాడి/ కోటగిరి/ రుద్రూర్/ పొతంగల్, జూన్20: పిల్లల ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపే నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం జిల్లాలో గురువారం నిర్వహించారు. అన్ని విద్యా సంస్థల్లో 19 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారికి వీటిని వేశారు. నగరంలోని అర్సపల్లిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరై పిల్లలకు మాత్రలను వేశారు.
నగర మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు. బోధన్ డివిజన్లో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని బోధన్ ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ ప్రారంభించారు. బోధన్‌లోని రాకాసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు ఆయన మాత్రలను ఇచ్చారు. బోధన్ డివిజన్లో 96 వేల మంది విద్యార్థులకు ఈ మాత్రలను పంపిణీచేస్తామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య మాట్లాడుతూ తొలిరోజు మాత్రలు వేసుకోనివారు.. ఆరు రోజుల్లో ఎప్పుడైనా తప్పకుండా వేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మేరీ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణ మాత్రలను వైద్యులు, సిబ్బంది విద్యార్థులకు పంపిణీ చేశారు. బషీరాబాద్ అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ సుప్రియ పిల్లలకు మాత్రలు వేశారు. భీమ్‌గల్ మండలం సంతోష్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మాత్రలు పంపిణీ చేసినట్లు హెచ్ఎం మల్క జనార్దన్ తెలిపారు.
ఆర్మూర్ వడ్డెర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రలను కౌన్సిలర్ సంగీత పంపిణీ చేశారు. ఆలూర్ మండలంలోని కల్లెడ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రలను వైస్ ఎంపీపీ సుజాత వేశారు. బోధన్ మండలంలోని లంగ్డాపూర్ గ్రామంలో చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలు బోధన్ ఎంపీవో మధుకర్ వేశారు. రెంజల్ మండలం నీలా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎంపీడీవో శ్రీనివాస్ అందజేశారు. ఎంఈవో గణేశ్‌రావు కులకర్ణి, హెచ్ఎం ఇల్తెపు శంకర్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
కోటగిరి హైస్కూల్ ఆవరణలో ఎంపీపీ సునీత పిల్లలకు మాత్రలు వేశారు. రుద్రూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో మాత్రలు వేసినట్లు హెచ్‌ఈవో రాజేందర్ తెలిపారు. పొతంగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.