వినాయక నగర్, మే 31: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కక్షలతో సోహెల్ ఖాన్ అనే యువకుడిపై బంధువులు కత్తితో దాడి చేశారు. కొంత కాలంగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నందున కక్ష పెంచుకున్న బంధువులు బక్రీద్ సందర్భంగా ఇంటికి వచ్చిన సోహెల్‌పై కత్తితో దాడికి తెగబడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలతో సోహెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోహైల్‌పై బంధువుల దాడికి సంబంధించిన వివరాలను నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ వెల్లడించారు.
నాలుగో టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మీ కాలనీకి చెందిన సోహెల్ ఖాన్ శనివారం రాత్రి బక్రీద్ సందర్భంగా నగరంలోని పులాంగ్ ప్రాంతంలోని తమ బంధువులు షాహిద్ ఖాన్, సాజిద్ ఖాన్‌లను కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఉన్న జావిద్ ఖాన్, అతని కుమారులు ఫర్జాన్, జియాన్, వారి బామ్మర్ది అక్బర్లు ఒక్కసారిగా సోహెల్‌పై దాడి చేశారు. అక్బర్ కత్తితో సోహెల్ తలపై దాడి చేయగా.. తలకు బలమైన గాయమైంది. తలకు కత్తిపోట్లతో రక్తస్రావం జరిగి.. గాయాల పాలైన సోహెల్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రి తరలించారు.
ఆస్పత్రికి వెళ్లి బాధితుడు సోహెల్‌ను విచారించిన నాలుగో టౌన్ ఎస్సై సందీప్ వివరాలు సేకరించారు. సొహైల్‌పై కత్తితో దాడి చేసిన అక్బర్ అనే వ్యక్తికి, సాజిద్ ఖాన్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని బంధువులు పథకం ప్రకారమే సోహెల్‌పై దాడి చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడి విషయమై బాధితుడి తండ్రి సలీం ఖాన్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఫోర్త్ టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ వెల్లడించారు.