నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది యాసంగితో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగింది. సమృద్ధిగా వర్షాలు కురవడంతో జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జల మట్టాలు సైతం పెరిగాయి. నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో అన్నదాతలు వరి వైపే మొగ్గు చూపారు. గత యాసంగిలో 3,46,672 ఎకరాల్లో వరిసాగు కాగా, ఈ ఏడాది 3,90,269 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 43 వేల ఎకరాల్లో అధికంగా సాగు చేశారు. వరితోపాటు మక్కజొన్న, శనగ పంటల సాగు సైతం పెరిగింది. ఆరుతడి పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించినప్పటికీ అన్నదాతలు సంప్రదాయ పంటల వైపే మొగ్గు చూపారు. రాష్ట్ర ప్రభుత్వమే గ్రామగామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించడంతోపాటు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
ఖలీల్వాడి, ఫిబ్రవరి 12 : గత యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు వరి, మక్కజొన్న, శనగను పెద్దమొత్తంలో సాగు చేస్తున్నారు. మరోవైపు కొంత మంది మాత్రమే ఆరుతడి పంటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించినా రైతులు వరి పైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో అన్నిరకాల పంటలు కలిపి మొత్తం 4,96,279 ఎకరాలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,81,426 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో 4,71,542 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ సీజన్లో ఇప్పటి వరకు 4,81,426 ఎలకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. గత యాసంగితో పోలిస్తే సుమారు పదివేల ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలాశయాలు, చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో వరి, మక్కజొన్న పంటలనే ఎక్కువగా సాగు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల నుంచి పంటలకు సాగునీరు విడుదల కావడంతో పంటలు కళకళలాడుతున్నాయి.
తగ్గిన ఆరుతడి పంటల సాగు..
వరి, మక్కజొన్న, శనగ పంటలకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లో మంచి ధర వస్తున్నది. దీంతో రైతులు ఇవే పంటలను సాగు చేస్తున్నారు. గతేడాది యాసంగితో పోలిస్తే ఈ ఏడాది ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి కనబర్చడం లేదు. తద్వారా ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. జొన్న, పప్పుదినుసులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వుల సాగు తగ్గిపోయింది. మార్కెట్లో ఆరుతడి పంటల ధరలు నిలకడగా లేకపోవడం కూడా పంటలు సాగు చేయకపోవడానికి కారణమని చెప్పవచ్చు. అలవాటుగా సులభంగా చేతికొచ్చే వరి, మక్కజొన్న పంటలు సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు.
అంచనాలను మించి..
వరి పంట గతేడాదితో పోలిస్తే ఎక్కువ సాగైంది. ఈ ఏడాది యాసంగిలో 3,67,739 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు 3,90,269 ఎకరాల్లో పంటలను వేశారు. అంచనా కన్నా దాదాపు 22వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. మక్కజొన్న గతేడాది 12,493 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 26,781 ఎకరాలకు పెరిగింది. ఈసారి 19,745 ఎకరాల్లో మక్కజొన సాగువుతుందని అంచనా వేయగా ఏడు వేల ఎకరాల్లో అధికంగా సాగయ్యింది.
ఇతర పంటలు వేయాలి..
ఏటా వానకాలం, యాసంగిలో రైతులు సులభంగా చేతికొచ్చే వరి పంటనే సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, కూరగాయలు, ఇతర పంటలను కూడా సాగు చేయాలి. మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలు చాలా ఉన్నాయి. రైతులు పంట మార్పిడి పాటిస్తూ లాభాలు వచ్చే ఇతర పంటలు వేసేందుకు ప్రయత్నించాలి.
-తిరుమల ప్రసాద్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిజామాబాద్