బోధన్, డిసెంబర్ 23: నిజాంషుగర్స్ శక్కర్‌నగర్, మెదక్, మెట్పల్లి యూనిట్లకు ప్రైవేట్ యాజమాన్యం అక్రమంగా లేఆఫ్ ప్రకటించి సోమవారం నాటికి తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ పట్టణం శక్కర్‌నగర్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ మెయిన్‌గేట్ ఎదుట కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2015 డిసెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి నిజాం షుగర్స్‌కు ప్రైవేట్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. అయితే లేఆఫ్ జరిగిన తొమ్మిదేండ్లకు చట్టప్రకారం చెల్లించాల్సిన వేతనాలను ప్రైవేట్ యాజమాన్యం ఇప్పటివరకు చెల్లించలేదు.
దీంతో తమ వేతన బకాయిలను చెల్లించాలని, నిజాం షుగర్స్‌ను వెంటనే తెరిపించాలని డిమాండ్‌చేస్తూ కార్మికులు నల్లబ్యాడ్జీలతో ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ఎదుట నిరసన తెలిపారు. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతవరకు ఫ్యాక్టరీని తెరిపించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. లేఆఫ్ కాలానికి తమ వేతన బకాయిలను ప్రభుత్వం ఇప్పించాలని వారు కోరారు. నిరసన కార్యక్రమంలో కార్మిక నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్‌గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, రాంబాబు, ఈరవేణి సత్యనారాయణ, శ్రీధర్, దాస్, భూమయ్య, శివరాములు, భిక్షపతి, మాజీ కౌన్సిలర్ మిద్దెల రామరాజు తదితరులు పాల్గొన్నారు.