ఏర్గట్ల, ఏప్రిల్ 14 : రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న స్త్రీ నిధి రుణాలు.. మహిళలకు ఆర్థిక అండగా నిలుస్తున్నాయి. పలువురు మహిళలు స్త్రీ నిధి రుణాల ద్వారా స్వీయ ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. పలు గ్రామాల మహిళలు.. సంఘం ద్వారా వచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ అధికారుల సలహాలు, సూచనలతో పలువురు మహిళలు స్త్రీ నిధి రుణాలు పొంది సొంతగా వ్యాపారాలు ప్రారంభించారు. టైలరింగ్, కిరాణా దుకాణాలు, చిన్న చిన్న యంత్రాల ద్వారా పరికరాల తయారీతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
వత్తుల తయారీతో రూ.15 వేల వరకు ఆదాయం..
ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన బైండ్ల లావణ్య స్త్రీ నిధి ద్వారా లక్ష రూపాయల రుణం తీసుకున్నది. ఈ డబ్బులతో వత్తులు తయారు చేసే యంత్రంతోపాటు ముడి సరుకులు కొనుగోలు చేసింది. ఇంటి వద్దే యంత్రం సహాయంతో వత్తులు తయారు చేసి విక్రయిస్తున్నది. నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు సంపాదిస్తున్నట్లు బైండ్ల లావణ్య తెలిపారు.
ఇంటి వద్దే ఉంటూ సుగంధ ధూపం కప్పుల తయారీ..
దోంచందకు చెందిన పానుగంటి వసంత రూ. 80 వేల స్త్రీ నిధి రుణం తీసుకున్నది. ఈ డబ్బులతో సుగంధంతో ధూపం కప్పులు తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఇంటి వద్దే ఉంటూ సుగంధ ధూపం కప్పులు తయారు చేసి విక్రయిస్తున్నది. నెలకు సుమారు రూ. 10 వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆయా కంపెనీలకు చెందిన వారు ముడి సరుకులను అందస్తున్నారని, వాటితో వత్తులు, సుగంధ ధూపం కప్పులు తయారు చేసి కంపెనీలకు అందజేస్తున్నారని మహిళలు తెలిపారు.
ఏ ఇబ్బందీ లేకుండా వత్తుల తయారీ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు డ్వాక్రా గ్రూపుల ద్వారా అందజేస్తున్న రుణాన్ని తీసుకున్నాను. లక్ష రూపాయల రుణం తీసుకొని వత్తులు చేసే యంత్రాన్ని కొనుగోలు చేశాను. ఇంటి వద్దే ఉంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వత్తులు తయారు చేసి విక్రయిస్తున్నాను. నెలకు సుమారు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు సంపాదిస్తున్నాను.
– బైండ్ల లావణ్య,తాళ్ళ రాంపూర్ గ్రామం
నెలకు రూ. 10 వేల వరకు సంపాదిస్తున్నా..
నేను రూ. 80 వేల స్త్రీ నిధి రుణాన్ని తీసుకున్నాను. ఈ డబ్బులతో సుగంధ ధూపం కప్పులు తయారు చేసే మిషన్ను కొన్నా. కంపెనీ వారు ముడి సరుకులు ఇస్తున్నారు. వాటితో సుగంధ కప్పులను తయారు చేసి విక్రయిస్తున్న. ఖర్చులు పోగా నెలకు రూ. 10 వేల వరకు సంపాదిస్తున్నాను.
– పానుగంటి వసంత, దోంచంద గ్రామం
స్త్రీ నిధి రుణాలతో ఆర్థికంగా రాణిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు అందిస్తున్న స్త్రీ నిధి రుణాలతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు కిరాణ షాపులు, బట్టల దుకాణాలు, వత్తుల తయారీతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు సమావేశాలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నాం.
-శ్యాం, ఐకేపీ ఏపీఎం, ఏర్గట్ల మండలం