నిజామాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వప్నం సాకారమైంది. బంగారు భవిష్యత్తుకు బాట పడింది. వైద్యవిద్య చదవాలన్న వేలాది మంది విద్యార్థుల కలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా తెలంగాణలో తెల్లకోటు విప్లవానికి తెరలేపడంతో మెడిసిన్ సీట్లు భారీగా పెరిగాయి. ఫలితంగా ఒకనాడు సంపన్నులకే పరిమితమైన వైద్యవిద్య.. ఇప్పుడు పేదింటి బిడ్డల దరిచేరింది. ఆర్థికంగా లేని ఎంతో మందికి కేసీఆర్ కృషితో ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. వారి కలల సౌధాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తొలి అడుగులు పడ్డాయి.
ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నతమైన విద్య ఏదైనా ఉందంటే అది కేవలం వైద్య విద్య మాత్రమే. గతంలో ఇలాంటి విద్యను అభ్యసించాలంటే అది కేవలం సంపన్న కుటుంబాలకు మాత్రమే సాధ్యమయ్యేది. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చినప్పటికీ వాటికయ్యే ఖర్చులను భరించలేక వెనుకడుగు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆర్థిక పరమైన సమస్యలతో ఏమీ చేయలేక ఎంబీబీఎస్ సీట్లను వదులుకొని ఇతరత్రా సాధారణ డిగ్రీ కోర్సులను చేసిన వారు లేకపోలేదు. తెలంగాణలో ఇదంతా గతం. వైద్య విద్యను అభ్యసించాలనుకునే యువతకు బంగారు భవిష్యత్తులాంటి ఎంబీబీఎస్ కోర్సును చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో సఫలీకృతమవుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలతో పేదింట ఎంబీబీఎస్ విద్యార్థులు వెలుస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలే ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం 2023-24 విద్యా సంవత్సరానికి తరగతులు సైతం మొదలవ్వడంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
ఖరీదైన చదువు సులువుగా…
ఖరీదైన చదువు కాస్తా సులువుగా మారడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం. వైద్య కళాశాలల ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైంది. రెండేండ్ల క్రితం వరకు వేలల్లో నీట్ ర్యాంకులు వచ్చినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు రాక ఇతరత్రా కోర్సుల్లో సర్దుకుపోయిన వారు అనేకులున్నారు. ఇప్పుడు అదే ర్యాంకులతో ఎంబీబీఎస్ సీట్లను సాధించుకోవడం ద్వారా అందరిలోనూ ఆనందం కనిపిస్తున్నది. ఎంబీబీఎస్ సీటుకు దాదాపుగా ఒక్కరిపై రూ.50లక్షలు వరకు వ్యయం అయ్యేది. ఎంబీబీఎస్ తర్వాత పీజీ విద్యను అభ్యసించే వారిపై రూ.75లక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను నేర్చుకునే వారికి రూ.90లక్షలు మేర ఖర్చు అయ్యేది. మెడికల్ కాలేజీలు భారీగా పెరగడంతో వేలల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడంతా సులువైంది. ఆసక్తి ఉండి డాక్టర్ కావాలని కలలు కనే వారికి తెలంగాణ సర్కారు ఇప్పుడొక వారధిగా మారుతున్నది. ఉచితంగానే ఎంబీబీఎస్ సీటును అందించి వారిని ప్రోత్సహిస్తున్నది. అలాంటి ఘటనలకు కామారెడ్డి మెడికల్ కాలేజీ సాక్షాత్కారంగా నిలిచింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారెందరో ఇక్కడి వైద్య కళాశాలల్లో సీట్లు పొంది తెల్లకోటుతో మురిసిపోతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వారి తల్లిదండ్రుల్లోనూ వర్ణించలేని ఆనందం కనిపిస్తున్నది.
బలహీన వర్గాలకు బాసటగా…
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన యువతీ, యువకులకు వైద్య విద్య చేరువైంది. బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రాతిపదికన మెడికల్ సీట్లలో కోటా వర్తిస్తుండడంతో డాక్టర్ కావాలనే కల నెరవేరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండడంతోనే ఇదంతా సాకారం అవుతున్నది. దీంతో వేల మందికి డాక్టర్ చదువు అందని ద్రాక్ష నుంచి అందిన ద్రాక్ష మాదిరిగా మారింది.
మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రోడ్డ ప్రభాకర్, మమతల కుమారుడు తరుణ్పవన్ ఎంబీబీఎస్‌లో సీటు సాధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి డీఈవో కార్యాలయంలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి మమత గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే సంకల్పంతోనే బైపీసీ తీసుకోగా.. మొదట సీటు రాకపోవడంతో లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లి రెండోసారి సీటు సాధించాడు. డాక్టర్ కోర్సు చదవడం డబ్బుతో కూడుకున్నపని. ఎంబీబీఎస్ చదవాలంటే పక్క రాష్ర్టాలు, విదేశాలు లేదా ప్రైవేటు కళాశాలల్లో లక్షల్లో డొనేషన్లు కట్టాల్సిన పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను స్థాపించడంతోపాటు డొనేషన్లు లేకుండా ర్యాంకు ఆధారంగా ఉచితంగా సీట్లు ఇవ్వడంతో తరుణ్ పవన్‌కు సొంత జిల్లాలోని మెడికల్ కళాశాలలోనే సీటు వచ్చింది.
నేనే ఉదాహరణ..
తెలంగాణ వస్తే ఏమొస్తది..అనే వాళ్లకు నేను ఉదాహరణ. నాలాంటి ఎంతో మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలా ఉండే డాక్టర్ కోర్సు నేడు సొంత జిల్లాలో చదివేలా అందుబాటులోకి వచ్చింది. నిత్యం మాదాపూర్ నుంచి జిల్లా కేంద్రానికి బస్సులో వెళ్లి ఎంబీబీఎస్ చదవడం ఆనందగా ఉన్నది. ఉచితంగా సీటు రావడం, ఎలాంటి ఫీజులు లేకపోవడం.. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయి. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– తరుణ్పవన్, ఎంబీబీఎస్ సెకండియర్, నిజామాబాద్ మెడికల్ కళాశాల
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల ఆత్మకూర్ గ్రామానికి చెందిన వ్యవసాయాధారిత కుటుంబమైన యాటకారి విజయ్‌కుమార్-విజయ దంపతులకు ఇద్దరు పిల్లలు రవి, రమ్య. రైతు కుటుంబం కావడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే వారి చదువు కొనసాగింది. అన్నాచెల్లెళ్లకు చదువుపై ఆసక్తి ఉండడంతోపాటు ముఖ్యమంత్రి ముందుచూపు తోడవడంతో ఇద్దరూ మెడికల్ కళాశాలలో సీట్లు సంపాదించి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇంతకాలం ధనిక వర్గానికే సాధ్యమైన ఎంబీబీఎస్ చదువు సీఎం కేసీఆర్ నిర్ణయంతో మధ్య, దిగువ తరగతి విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. రవికి గత సంవత్సరం సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా రావడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అదే ఊపును కొనసాగిస్తూ చెల్లెలు రమ్య కూడా సిరిసిల్ల మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో సీటు సాధించడంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తంచేస్తున్నది. యాటకారి విజయ్ కుమార్ – విజయలు పెద్దగా చదువుకోకపోయినా తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలనే కోరిక.. సీఎం కేసీఆర్ విరివిగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో నెరవేరబోతున్నది.
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే..
గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడంతో మా అమ్మానాన్న పడిన కష్టాలు చూసి చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివాను. 10వ తరగతి స్థానిక గురుకుల పాఠశాలలో పూర్తిచేశాను. ఇంటర్లో 976 మార్కులు సాధించాను. నీట్లో 500 స్కోర్ సాధించడంతో నాకు సంగారెడ్డి మెడికల్ కళాశాలలో గత సంవత్సరం ఉచితంగా ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైంది.
– యాటకారి రవి, ఆత్మకూర్
మా కల సాకారం చేశారు..
ఎంబీబీఎస్ అనగానే ధనిక వర్గాల చదువు అనే అపోహ ఉండేది. తెలంగాణలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో నూతనంగా 21 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్యవిద్య అందరిదీ అనే పరిస్థితి, ధైర్యాన్ని కల్పించారు. గతేడాది మా అన్నయ్య రవి, ఈ సంవత్సరం నేను ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించి మా తల్లిదండ్రులు పడిన కష్టానికి కానుకగా ఇచ్చాం. మెడికల్ కళాశాలల సంఖ్య పెంచి మాలాంటి పేద కుటుంబాల కలలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– యాటకారి రమ్య, ఆత్మకూర్
నిరుపేద కుటుంబంలో పుట్టిన సుజిత్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా, ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ డాక్టరేట్ సాధించాడు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న సుజిత్‌కుమార్.. తాను డాక్టర్‌ను అవ్వాలనుకొని కష్టపడి చదివాడు. గురుకుల విద్యాలయంలో ఇంటర్ చదివిన సుజిత్‌కుమార్.. ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించాడు. నీట్ తొలి ప్రయత్నంలో ఎంబీబీఎస్ సీటు సాధించలేకపోయాడు. ఎంసెట్‌లో వెటర్నరీ సైన్స్‌లో వచ్చినప్పటికీ నీట్ కోసం ప్రిపేర్ అయ్యాడు. సొంత జిల్లాలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో రెండోసారి సులభంగా ఎంబీబీఎస్ సీటు సాధించాడు కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన మేకల సుజిత్ కుమార్.
పేదలకు వైద్యవృత్తి చేరువయ్యింది..
రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి వైద్య వృత్తిని చేరువ చేయడం అభినందనీయం. ధనికులు మాత్రమే ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉండగా.. సీఎం కేసీఆర్ కృషితో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో మాలాంటి వారికి మెడిసిన్ చదివే అవకాశం కలిగింది. మా బాబు డాక్టర్ అయ్యి పేదవారికి సేవ చేయాలనేదే మా సంకల్పం.
-మేకల రామస్వామి (సుజిత్‌కుమార్ తండ్రి), దోమకొండ
నాన్న డాక్టరేట్, నేను డాక్టర్ కావాలనే కోరిక…
మాది పేద కుటుంబం. మా నాన్న మేకల రామస్వామి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కూలిపని, ట్రాక్టర్ డ్రైవర్‌గా, ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్తూనే సాయంప్రాఛ్య కళాశాలలో చదివాడు. అనంతరం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం సంపాదించి డాక్టరేట్ పట్టా పొందాడు. నేనూ మా నాన్నలాగే డాక్టరేట్ పట్టా అందుకోవాలనే ఉద్దేశంతో మెడిసిన్‌ను ఎంచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో నా కల నెరవేరింది. భవిష్యత్తులో అంకాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌ను అయ్యి.. ప్రజలకు సేవలందించాలని ఉన్నది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.
-మేకల సుజిత్ కుమార్, ఎంబీబీఎస్ విద్యార్థి, కామారెడ్డి మెడికల్ కాలేజీ
వైద్య సేవల మెరుగుకు ఊతం..
మెడికల్ కాలేజీల స్థాపనతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడనున్నది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 330 పడకలతో కూడిన వైద్యశాల సైతం నెలకొల్పబడింది. దీంతో జిల్లా దవాఖానగా సేవలందిస్తున్న కామారెడ్డి వైద్యశాల.. ఇకపై జనరల్ దవాఖానగా రూపాంతరం చెంది ప్రజల సేవలో నిమగ్నం కానున్నది. ప్రస్తుతం పలు క్రిటికల్ కేసుల విషయంలో వైద్య సేవలకు అంతగా సదుపాయం లేదు. క్లిష్టమైన శస్త్రచికిత్సలకు అవకాశమే లేదు. కామారెడ్డి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం విషయంలో ఇబ్బందులు వస్తే హైదరాబాద్‌కు వెళ్లడమే తప్ప వేరేమార్గం లేదు. మెడికల్ కాలేజీ ద్వారా స్థాపించబడే జనరల్ దవాఖానతో అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో వస్తాయి. ఇకపై ఇక్కడి వారెవ్వరూ హైదరాబాద్‌కు పయనం కావాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న కామారెడ్డి మెడికల్ కాలేజీకి అనుబంధంగా త్వరలోనే అధునాతన సౌకర్యాలతో దవాఖాన రూపుదిద్దుకోబోతున్నది.
వీరు.. డిచ్పల్లి మండలం దేవపల్లి(లెప్రసీ కాలనీ) గ్రామానికి చెందిన కాసు భానురావు-పద్మావతి. భానురావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, పద్మావతి కూలి పని చేస్తున్నది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించాలన్న పట్టుదలతో ఒకరిని ఇంజినీరింగ్ చదివిస్తుండగా, మరొకరిని డాక్టర్ చదివించేందుకు ముందుకొచ్చారు. సంపాదించేదే కొంతైనా.. అందులోనూ కొంత మొత్తాన్ని పిల్లల చదువులకు కేటాయిస్తున్నారీ దంపతులు. కుమారుడు నితిన్ కుమార్‌ను డాక్టర్ చదివించాలన్నది తల్లిదండ్రులిద్దరి కోరిక. డాక్టర్ చదువంటే డబ్బులు పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. కానీ అదే సమయంలో భరోసానిచ్చింది సీఎం కేసీఆర్ చేసిన వైద్యకళాశాలల ప్రకటన. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, ఆ దిశగా వేగంగా పనులు పూర్తవ్వడంతో ఈ కుటుంబానికి ఎంతో మేలు చేకూర్చింది. నితిన్కుమార్కు నీట్ ఫలితాల్లో 544/720 మార్కులు రాగా, రాష్ట్రస్థాయి ఓపెన్ కేటగిరీలో సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. దీంతో తల్లిదండ్రులతోపాటు దేవపల్లి గ్రామస్తులు సైతం హర్షం వ్యక్తంచేశారు. కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుతో నిరుపేద కుటుంబానికి చెందిన నితిన్కుమార్కు సీటు వచ్చిందని, దీనంతటికీ సీఎం కేసీఆర్ నిర్ణయమే ప్రధాన కారణమని సంబురపడుతున్నారు.
ఊరంతా సంతోష పడ్డారు
ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో ఎంతో సంతోషపడ్డాం. మా గ్రామంలో 80 కుటుంబాలున్నాయి. అందులో మా కొడుక్కి ఎంబీబీఎస్ సీటు రావడంతో ఊరంతా ఎంతో సంతోషపడ్డారు. మంచిగా చదివి డాక్టర్‌గా నిరుపేదలకు సేవ చేయాలనేదే మా కోరిక. అందుకే చిన్నప్పటి నుంచి బాగా చదివించాం. మొదటి నుంచి మా కుమారుడు ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యేవాడు. పుస్తకాల పురుగు అనేవాళ్లు. మా కష్టానికి తగిన ఫలితం దక్కింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక తనకుండేది. పట్టుదలతో చదివాడు. చదువు చెప్పే గురువులు తరచూ తన భుజం తట్టేవారు. సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతోనే మా కొడుక్కి సీటు వచ్చింది. ఆయనకు రుణపడి ఉంటాం.
– భానురావు-పద్మావతి (నితిన్‌కుమార్ తల్లిదండ్రులు), దేవపల్లి