ఉమ్మడి జిల్లావాసులను ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు నిర్మాణం కలగానే మిగిలిపోనున్నదా.. తాజా పరిస్థితులు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులేని తనంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టుపై ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. వరంగల్‌కు దీటుగా అనేక అనుకూలతలు నిజామాబాద్ జిల్లాకు ఉండడంతో విమానాశ్రయం తథ్యమనే సంకేతాలు వినిపించాయి. కానీ పరిస్థితులు ఇప్పుడు తలకిందులైనట్లుగా కనిపిస్తున్నది.
-నిజామాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు విషయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. జక్రాన్‌పల్లి, ఆదిలాబాద్, బసంత్‌నగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందడంతో గత నెల 23, 24, 25వ తేదీల్లో ముగ్గురు సభ్యుల సాంకేతిక నిపుణుల బృందం క్షేత్ర స్థాయిలో ఎయిర్పోర్ట్ అవకాశాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది.
ఇందులో జక్రాన్‌పల్లి ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలంలో జలాశయం ఉండడాన్ని బృందం గుర్తించింది. సమీప భూముల్లో విద్యుత్ స్తంభాలు, పొలాలు సాగు చేస్తుండడాన్ని, ఓ మతానికి చెందిన ప్రార్థన ప్రదేశం కూడా ఉన్నదని అందులో పేర్కొనడంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు పచ్చజెండా వస్తుందా? రాదా? అన్నది డైలమాలో పడింది. ఎయిర్పోర్ట్ కోసం భూమిని సేకరించడంలో సరైన సన్నద్ధత రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించలేదని నిపుణులు తేల్చినట్లు తెలుస్తోంది.
ఎయిర్‌పోర్టు నిర్మిస్తే 2024-25 సంవత్సరానికి గాను ఏటా 0.105 మిలియన్ల ప్రయాణికులు, 2054-55 సంవత్సరానికి గాను ఏటా 0.624 మిలియన్ల ప్రయాణికులు సేవలు పొందుతారని నివేదికలో వివరించారు. ఐదు గ్రామాల పరిధిలో 700 మంది పట్టాదారులకు చెందిన 802.37 ఎకరాలు, మరో 913 అసైన్డ్ పట్టాదారులకు సంబంధించిన 860.08 ఎకరాల్లో మొత్తం కలిపి 1613 మంది పట్టాదారులు, అసైన్డ్ పట్టాదారులకు సంబంధించిన 1663.05 ఎకరాల్లో సర్వే చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ విమాన రాకపోకల కోసం తీవ్రంగా శ్రమించారు. త్వరితగతిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు గల్ఫ్‌కు వెళ్లి వచ్చే వారి సంఖ్య భారీగా ఉండడంతో జక్రాన్‌పల్లిలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ అవసరమని కేసీఆర్ సర్కారు గుర్తించింది. కానిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ ఎయిర్‌పోర్టు ఘనత తమదే అన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అయితే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఒక్క అడుగు ముందుకు పడకపోవడం ఎవరి ఘనత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో గ్రీన్‌ఫీల్డ్‌కు అంగీకారం
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జక్రాన్‌పల్లి వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ, కొలిప్యాక, అర్గుల్, మనోహరాబాద్, జక్రాన్‌పల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1663.05 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేలా సర్వే చేశారు. ఇందులో 816.4 ఎకరాలు మాత్రమే ఉపయోగపడుతుందనిగతంలోనే ఏఏఐ పేర్కొంది. 1663.05 ఎకరాలకు మరో 68 ఎకరాలు భూమి అవసరం ఉంటుందని నివేదికలో తెలిపింది. ఇందులో మొదటి దశలో విమానాశ్రయం నిర్మాణం కోసం రూ.321 కోట్లు అంచనా వ్యయంగా నివేదికలో పేర్కొన్నారు.
అడ్డంకి ఏమిటో…?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆరు చోట్ల విమానాశ్రయాలకు ప్రతిపాదనలు ఉండగా ఏఏఐ ఇచ్చిన నివేదికలో మూడింటికి మాత్రమే అనుమతి లభించింది. రాష్ట్రంలో వరంగల్ జిల్లా మామునూర్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లలో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
అయితే వీటిలో మూమునూర్, ఆదిలాబాద్ బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల్లో జక్రాన్‌పల్లికి పచ్చజెండా లభించింది. 2021 జులై 23న నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా బదులిస్తూ తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియ నడుస్తోందన్నారు. 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 17నెలల పాలనలో మామునూరు ఎయిర్‌పోర్టుకు అనుమతులు లభించాయి.
ఈ ఘనత వెనుక కేసీఆర్ సర్కారు కృషి ఎంతగానో దాగి ఉన్నది. ప్రస్తుతం జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు అంశం అటకెక్కినట్లుగానే కనిపిస్తోంది. ఏఏఐ బృందం అధ్యయనం చేసి తాజాగా నివేదిక సమర్పించగా అందులో ప్రతికూలతలపై పలు అంశాలను జోడించడం అనుమానాలకు తావిస్తోంది. వరంగల్‌లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో నిజామాబాద్‌లో విమానాశ్రయం అవసరం లేదనే అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లుగా పలువురు చర్చించుకుంటున్నారు.
పట్టించుకోని బీజేపీ ఎంపీలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఎంపీలు లేరు. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ గతంలో బీఆర్ఎస్ ఎంపీలు పోరాట ఫలితంగా మామునూర్ ఎయిర్‌పోర్టు సాధ్యమైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో 2019, 2024 రెండు పర్యాయాలు బీజేపీ ఎంపీలే గెలుపొందారు.
ఇందులో ఒకరు కేంద్ర సహాయ మంత్రిగానూ ఉన్నారు. అయినప్పటికీ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కనీసం పట్టించుకోవడం లేదు. జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటైతే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు మెదక్ జిల్లాకు సైతం లాభం చేకూరునున్నది. తెలంగాణలో 17 మంది లోక్‌సభ సభ్యులకు 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడం గమనార్హం.