కమ్మర్పల్లి : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఇండోర్ మైదానంలో జరుగుతున్న 69వ ఎస్జీఎఫ్(SGF) అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ అండర్-17 (బాలబాలికల) టోర్నమెంట్, ఎంపికల పోటీల ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) గురువారం ప్రారంభించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తాను ఎప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి, వేల్పూర్ వేదికగా రాష్ట్ర స్థాయి (State Level) ఈవెంట్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేని విధంగా, బాల్కొండ నియోజకవర్గంలో రెండు ఇండోర్ స్టేడియంలు కమ్మర్పల్లి ,వేల్పూర్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తన తండ్రి, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గొప్ప క్రీడాకారుడని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో వేముల సురేందర్ రెడ్డి పేరుపై రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడానికి అసోసియేషన్ , అధికారులు చొరవ తీసుకుంటే తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా స్వీకరించాలని సూచించారు. జీవిత పాఠాలు నేర్పే క్రీడలు నిజ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, కష్టనష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యం క్రీడల ద్వారానే అలవడుతుందని తెలిపారు.
క్రీడాకారులకు, అసోసియేషన్ సభ్యులకు తన సహకారం ఉంటుందని, క్రీడల నిర్వహణలో ఎవరూ వెనకడుగు వేయవద్దని సూచించారు. క్రీడల నిర్వహణలో పీఈటీ (PET)లు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవను, వారి అంకితభావాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, క్రీడా సంఘం బాధ్యులు సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శోభన్, నాగమణి, నిజామాబాద్ ఎస్జీఎఫ్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి , పీఈటీలు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, నీరజ రెడ్డి, ఎంఈవో సాయన్న, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.