వేల్పూర్/బాల్కొండ, మార్చి 30 : తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు ఎంపీ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి వేల్పూర్, ఉమ్మడి బాల్కొండ మండలాల కార్యకర్తల సన్నాహాక సమావేశాలను శనివారం వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతోనే కాంగ్రెస్ గద్దెనెక్కిందని, దీంతో మూడునెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. రూ. 4వేల పెన్షన్, మహిళలందరికీ నెలకు రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు, రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధుసాయం పెంపు, యువవికాస్ తదితర ఎన్నో హామీలిచ్చిన విషయాన్ని కార్యకర్తలకు ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఒక్క హామీని కూడా ప్రజలకు అందజేయలేదన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు అడగాలని సూచించారు. రేవంత్‌రెడ్డి కమీషన్లు దండుకొని కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు పంపడం తప్ప.. రైతు, ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీ అర్వింద్ ఐదేండ్లలో ఒక్క గ్రామాన్ని కూడా సందర్శించలేదని, పల్లెల అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదని గుర్తుచేశారు. తప్పుడు బాండ్ పేపర్‌తో రైతుల ఓట్లు దండుకున్న ఆయన.. పసుపు బోర్డును ఎక్కడికి తెచ్చాడని ప్రశ్నించారు. వేల్పూర్, బాల్కొండలో ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. బాల్కొండలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ బుడ్డర్ఖాన్ మాటలను నమ్మవద్దని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు రేవంత్ తీరు ఉన్నదని విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ, రైతుభరోసా అని మాయ మాటలు చెప్పి, ఇప్పుడు సీఎం అయ్యాక రైతుల దిక్కు కూడా చూడకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడ..? రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడ? వడ్లకు రూ.500 బోనస్ ఎక్కడ? అని ప్రశ్నించారు. బోర్లు ఎత్తిపోయి, పంటలు ఎండిపోయి రైతులు అరిగోస పడుతుంటే పట్టించుకునే వారే లేరన్నారు. ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప జిల్లాకు చేసింది శూన్యమని విమర్శించారు. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపుబోర్డు.. ఐదేండ్లు గడిచినా రాలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తాడని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలని, హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాలని కోరారు.
రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేండుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం చాలా అవసరమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ఆత్మ లేదన్నారు. పార్టీలు మారే వారు మారుతారని, తాము మాత్రం తెలంగాణ కోసం నిక్కచ్చిగా నిలబడుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో పసుపు బోర్డుపై తాను ప్రశ్నిస్తే.. ఏర్పాటు చేయబోమని సమాధానం ఇచ్చారని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు
– ఎంపీ సురేశ్‌రెడ్డి