నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 21: మండలంలోని పోచారం ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం నెలకొన్నది. ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతేడాది వర్షాకాలం ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు కోతకు గురైంది. ఒక్కసారిగా లక్షా 80వేల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు వంతెన ఉంటుందా తెగిపోతుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఒకదశలో మెదక్ జిల్లా సర్థన, నాగిరెడ్డిపేట్ మండలంలో చీనూర్, వాడి గ్రామాలను రాత్రికి రాత్రే ఖాళీ చేయించారు. అదేరోజు రాత్రి అధికారులు, స్థానిక నాయకులు రెండురోజులపాటు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. కోతకు గురైన గోడ వద్ద ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించి, ఇసుక సంచులతో మరమ్మతులు చేపట్టారు. శాశ్వత పరిష్కారం చేపడితేగాని ప్రాజెక్టుకు ప్రమాదం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
తొమ్మిదినెలలైనా ప్రారంభంకాని పనులు
పోచారం ప్రాజెక్టు కోతగు గురై తొమ్మిది నెలలు గడుస్తున్నా పనులు ఇప్పటివరకూ ప్రారంభించకపోవడం గమనార్హం. మరో నెల దాటితే వర్షాకాలం రానున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ పనులు చేపట్టకపోవడంతో దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం
గతేడాది భారీ వర్షాలకు ప్రాజెక్టు ద్వారా పొంగి ప్రవహించిన వరదకు మెదక్, నాగిరెడ్డిపేట్ ప్రధాన రహదారిపై వంతెన తెగిపోయింది. దీంతో నాలుగు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. కానీ ఇప్పటివరకూ శాశ్వత నిర్మాణ పనులు చేపట్టకపోవడం గమనార్హం. హైవే పనుల్లో భాగంగా కొత్త వంతెన నిర్మాణం కోసం పిల్లర్లు కూడా వేశారు. అయితే గతంలో ఇచ్చిన ప్లాన్ కన్నా ఎత్తు పెంచాలనే ఆదేశాలతో పనులు ముందుకు సాగడంలేదని తెలిసింది. మళ్లీ వర్షాలు కురిస్తే వంతెన పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి మరమ్మతులకు రూ. 4 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వాటికి ఇంకా టెండర్లు పూర్తికాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. టెండర్లు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం. -వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డీఈఈ