Siricilla | సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 12 : గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ నెలల తరబడి వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు, సంక్షేమ పథకాల కల్పన వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.