Tuni Missing Case | కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(జాను) అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారింది. ఆ శునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చడం ద్వారా పాన ఆచూకీని కనిపెట్టాలని అనుకుంటున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామాయిల్ తోటకు గణేశ్-భవానీ దంపతులు కాపలదారులుగా పనిచేస్తున్నారు. వాళ్ల రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి గత శనివారం ఉదయం తమ పెంపుడు కుక్కతో కలిసి అడవి వైపు వెళ్లింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు చిన్నారి ఆచూకీ కోసం చుట్టుపక్కల అంతా వెతికారు. ఎక్కడా పాప ఆచూకీ కనిపించకపోవడంతో సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని గాలించారు. కానీ పాప ఆచూకీ దొరకలేదు. అయితే మంగళవారం మధ్యాహ్నం పాపతో వెళ్లిన కుక్క తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే తోటకు తిరిగొచ్చిన శునకం అక్కడ ఉన్న పోలీసులు, కుటుంబసభ్యులను చూసి భయపడి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో దాన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు చాకచక్యంగా వ్యవహరించి శునకాన్ని పట్టుకున్నారు. అయితే ఆ కుక్క ప్రస్తుతం ఆందోళనలో ఉండటంతో దాన్ని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు కూడా శునకాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జీపీఎస్ ట్రాకర్ తీసుకొచ్చి పోలీసులు ఆ కుక్కకు అమర్చారు. కుక్క తిరిగే మార్గాలను గుర్తించడం ద్వారా చిన్నారి ఆచూకీని కనిపెట్టాలని భావిస్తున్నారు.
నిజంగానే పాప అడవిలో తప్పిపోయిందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ టీవీ కెమెరాలను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వాహనాల రాకపోకలను కూడా ఆరా తీస్తున్నారు. అయితే తన కుమార్తెను భర్త స్నేహితులే కిడ్నాప్ చేసి ఉంటారని భవానీ ఆరోపిస్తుంది. చిన్నారి తల్లి భవానీ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె అడవిలో ఉండచకపోవచ్చని.. కచ్చితంగా ఎవరో తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త స్నేహితులతో గతంలోకొన్ని గొడవలు జరిగాయని.. వాటిని మనసులో పెట్టుకుని ఎవరైనా తన కుమార్తెను అపహరించి ఉంటారని తెలిపింది. ‘మాతో ఏమైనా సమస్య ఉంటే నేరుగా మాట్లాడండి.. కానీ నా చిన్నారిని తీసుకెళ్లి అన్యాయం చేయకండి. నా బిడ్డను క్షేమంగా తీసుకురండి‘ అంటూ కన్నీటిపర్యంతమైంది.