Collector Ila Tripathi | సిరికొండ, ఏప్రిల్ 16 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని కేజీ దాస్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, సేవలందించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ స్థాయిలో వచ్చిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన వారికి తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ 532 సర్వే నంబర్లకు సంబంధించిన భూముల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్యలు నెలకొని, అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో అందకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తూ, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సమర్పించి, భవిష్యత్ కార్యాచరణపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.