మేడిపల్లి,ఆగస్టు 1 : బోడుప్పల్లో దొంగల బీభత్సం సృష్టించారు.అడ్డుకోబోయిన ఇంటి యజమాని కుమారుడిపై ఇనుప రాడుతో దాడి చేసి పారిపోయారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బోడుప్పల్‌లోని ఆంజనేయనగర్‌లో ఉంటున్న బోయినిగల దాసు సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జూలై 29 రాత్రి తన కుటుంబసభ్యులతో కలిసి సొంతపనుల కోసం సొంతగ్రామమైన ఏపీలోని బాపట్ల జిల్లా అమర్తలూర్ మండలం బోడపాడు గ్రామానికి వెళ్లారు. తిరిగి 31న ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి వచ్చి చూడగా ప్రధాన ద్వారం తీసి ఉండడం, లైట్లు ఉండడం గమనించారు. అనుమానంతో దాసు కుమారుడు అజయ్‌కుమార్ తలుపులు నెట్టగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బయటకు వచ్చి కుటుంబసభ్యులను నెట్టి వేసి పారిపోయేందుకు యత్నించారు. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి ఇనుప రాడుతో అజయ్‌కుమార్ తలపై కొట్టడంతో అతడికి తీవ్ర గాయమైంది. బాధితులు ఇంట్లోకి వెళ్లి బీరువానును పరిశీలించగా విలువైన బంగారు ఆభరాణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ యాకయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.