nizamabad | కంటేశ్వర్ ఏప్రిల్ 25 : కేసీఆర్ పాలనలో 10 ఏండ్ల పాలన సంక్షేమం కోసమైతే.. రేవంత్ రెడ్డిది 17 నెలల పాలన విధ్వంసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిన పార్టీ కేసీఆర్ పార్టీ అని గుర్తు చే శారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 ఏండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా కేసీఆర్ నిలబెట్టారని, కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణ ను విధ్వంసం చేశారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని మండిపడ్డారు. అంతేకాక రాష్ర్టంలో పోలీసు నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించారు.
వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి కేసీఆర్ను ఆశీర్వదించండి
బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వరంగల్లో పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తోందని, కావున వేలాదిగా ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని వేముల ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సభ వెళ్లడానికి ఉమ్మడి నిజామాబాద్ నుండి ప్రత్యేక వాహనా ల్లో జిల్లా నుండి 40 వేల మందిని తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, షకీల్, సురేందర్, హన్మంత్ షిండేల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు.
గోల్మాల్ గోవిందంలా కాంగ్రెస్ పాలన
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా విఫలమైందని, గోల్మాల్ గోవిందం లాగా కాంగ్రెస్ పార్టీ పాలన తయారైందని బాజిరెడ్డి గోవర్ధన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి రాజ్యమేలుతుందని, కమిషన్ లేనిదే ఏ పని నడవడం లేదని, తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి మూటలు కడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిది నోరు కాదు మోరి అని మండ్డిపడ్డారు. కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి పని అయిపోతుందని భయపడుతున్నాడని, అందువల్లనే వరంగల్ సభను అడ్డుకోవాలని చూస్తున్నాడని, వరంగల్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలంతా తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, మాజీ మేయర్ నీతూ కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, సజీత్ ఠాకూర్, మాజీ జెడ్పీటీసీలు జగన్, గడ్డం సుమన్ తదితరులు పాల్గొన్నారు.