నిజామాబాద్ రూరల్, ఆగస్టు 2 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సంస్థ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఉమ్మడి జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు బుధవారం పెద్దసంఖ్యలో తరలివచ్చి సంబురాలు నిర్వహించారు. బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 43వేల పైచిలుకు ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల బంగారు భవిష్యత్తు కోసం ఈ నెల 3నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే విలీనం బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రాకముందే సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ నష్టాన్ని తగ్గించేందకు చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమష్టి కృషితో రూ.2,500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు నష్టాన్ని తగ్గించామన్నారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ అందుతాయని, తద్వారా వారి కుటుంబాలు బాగుపడుతాయన్నారు.
ఆర్టీసీ విలీనంపై ప్రతిపక్షాల ఆరోపణలను బాజిరెడ్డి ఖండించారు. సంస్థను ప్రైవేట్‌పరం చేయకూడదని నాడు డిమాండ్ చేసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. విలీనంలో మతలబు ఉన్నదనడం సిగ్గుచేటన్నారు. కేంద్రం.. ప్రభుత్వ ఆస్తులను అమ్మి ఉద్యోగులను రోడ్డుపై పడేసిన సంగతి మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజల బాగు కోసమే అని స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. నిజామాబాద్‌లో 35 ప్లాట్‌పామ్‌లతో కూడిన కొత్త బస్టాండ్‌ను త్వరలోనే నిర్మిస్తామని, భీమ్‌గల్ డిపోను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన కానుకను సిబ్బంది గుర్తించి కేసీఆర్‌కు మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంలు సరస్వతి, శంకర్, డిపో మేనేజర్లు ఆనంద్, వెంకటేశ్, శ్రీనివాస్, సదాశివ్, శ్రీనివాస్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.