నందిపేట్, ఆగస్టు 17 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆరునూరైనా ఆర్మూర్ నియోజకవర్గం మనదేనని స్పష్టంచేశారు. అన్నదాతలకు పుట్టినిల్లయిన గడ్డ కేసీఆర్ అడ్డా అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆర్మూర్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్‌కు శనిలా దాపురించిన కాంగ్రెస్, బీజేపీతో తాడో పేడో తేల్చుకుని పీడ వదిలిస్తామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 86 గ్రామపంచాయతీలు, 36 మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాలన్న కసితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, పదేండ్లలో ఆర్మూర్ ప్రగతికి తాము చేసిన కృషిని గుర్తు చేస్తామన్నారు.
నియోజకవర్గంలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి
నియోజకవర్గాన్ని రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇక్కడ చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవేనని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సిడీలే రూ.320 కోట్లు వచ్చాయని చెప్పారు. 62 వేల మందికి రూ.2016, రూ. 4016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని, 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుడి సాయం అందుతున్నదని వివరించారు. రూ.120 కోట్లతో పంచగూడ వంతెన నిర్మించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించినట్లు తెలిపారు. ఆర్మూర్‌కు వంద పడకల దవాఖాన సాధించామని, ఇక్కడ ఇప్పటికే 25 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించామని తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న 25 వేల మందికి పైగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయించానని, మరో 5 వేల మందికి ఎల్వోసీ చెక్కులు ఇప్పించి వారి ప్రా ణాలు కాపాడానని చెప్పారు. గడిచిన 20 నెలల్లోనే ఆర్మూర్‌ను అంధకారమయం చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్మూర్ నియోజకవర్గం పురోగతి కోల్పో యి అధోగతి పాలైందని మండిపడ్డారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకంతో అభివృద్ధి, సంక్షేమం మాయం కాగా కాంగ్రెస్ అధికార దురహంకారం, రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపులు, వేధింపుల మయం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్‌కు శాపంగా మారారని, అభివృద్ధి, సంక్షేమం గిట్టని బీజేపీ, కాంగ్రెస్‌కి చోటు లేదన్నారు. అవినీతి తప్ప అభివృద్ధి పట్టని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌రెడ్డి ఆగడాలను ప్రజలు భరించే పరిస్థితి లేదన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను మట్టికరిపించడమే ధ్యేయంగా పోరాడుతానన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేంత వరకు తగ్గేదెలే అని జీవన్‌రెడ్డి అన్నారు.