రాజంపేట్, మార్చి 27: వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం వేసిన బోర్లు ఎత్తిపోవడంతో నీటి ఎద్దడి తీవ్రంగా మారింది. కామారెడ్డి జిల్లా రాజంపేట, బస్వన్న పల్లిలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లే సరఫరా అవుతున్నాయి. కొంతకాలంగా నీటి సరఫరా అంతంతమాత్రంగానే రావడంతో ఇబ్బందులు తలెత్తాయి.
భగీరథ పథకం నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలకు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. ప్రైవేట్ బోర్లను హైరింగ్ తీసుకున్నప్పటికీ సరిపోవడం లేదు. రూ.వెయ్యి నుంచి 12వందలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా రెండు బోర్లు వేయించినప్పటికీ చుక్కనీరు పడలేదు. దీంతో గ్రామాల్లో తాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గ్రామస్తులు మండిపడుతున్నారు.
బస్వన్నపల్లి గ్రామంలో దాదాపు 50 చేద బావులు ఉన్నాయి. గతంలో నీటి అవసరాల కోసం ఇండ్ల ముందు ఉన్న చేద బావులను తోడుకున్నారు. ప్రస్తుతం నీటి ఇబ్బందులు తలెత్తడంతో మళ్లీ చేదబావులను ఆశ్రయించాల్సి వస్తున్నది.
నీటి సమస్య పరిష్కారం కోసం కొందరు తమ ఇండ్ల ముందు బోర్లు వేయిస్తున్నారు. కానీ పదిమందిలో ఒక్కరికీ మాత్రమే నీళ్లు రావడంతో బోర్లు వేయడానికి జంకుతున్నారు. బోర్ల కన్నా బావులే నయమని భావించి, కొత్తగా చేత బావులను తవ్విస్తున్నారు.
ప్రతి రోజు నల్లా సరిగ్గా రావడం లేదు. రెండు రోజులకొకసారి వచ్చినా నాలుగు బిందెలు కూడా నిండడంలేదు. బోరు వేద్దామంటే పడుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే చేసేదేమీలేక సొంతంగా చేద బావి తవ్విస్తున్న. నీళ్లు రావాలని వేడుకుంటున్న.
-ఎర్రం దర్శనం, బస్వన్నపల్లి
ఎన్ని బోర్లు వేసినా ఫెయిలవుతున్నయి. గతంలో ప్రభుత్వం నాలుగు బావు లు తవ్వించగా అవి ఇప్పు డు కొద్దిగా ఉపయోగపడుతున్నాయి. అలాగే మరికొన్ని బావులను తవ్విస్తే నీటి సమస్య తీరుతుంది.
-గడ్డం విఠల్ రెడ్డి బస్వన్నపల్లి
వారంలో మూడు రోజులు నల్లా నీళ్లు రావడం లేదు. వచ్చినా నాలుగు బిందెలే నింతుడు తున్నయి. అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలి.
-సుతారి భాగ్యమ్మ, బస్వన్నపల్లి
నేను 20 ఏండ్ల క్రితం ఇంటి నిర్మాణ సమయంలో చేద బావి తోడుకున్నా. దీంతో నీటి కష్టాలు దూరమైనయి. కుళాయిలో నీళ్లు రాని రోజు చుట్టపక్కల వారు వచ్చి బావి నుంచి నీటిని తీసుకెళ్తారు.
– మంగళి కిష్టయ్య, బస్వన్నపల్లి