మోర్తాడ్, ఏప్రిల్ 12: శ్రీరాంసాగర్ వరదకాలువలో నీరు క్రమంగా తగ్గిపోతున్నది. వారం పది రోజుల్లో వరదకాలువ పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ అక్విడెక్ట్ వద్ద వరద కాలువకు గండిపడింది. దీంతో ఎస్సారెస్పీ నుంచి వరదకాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. సంవత్సర కాలంపాటు నిండుకుండలా ఉండే వరదకాలువ గండి కారణంగా నీరులేక బోసిపోతున్నది.
మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల రైతులు యాసంగి పంటలను పండించుకోవడం కష్టమని భావించి రివర్స్‌పంపింగ్ ద్వారా వరదకాలువలోకి నీళ్లు తీసుకువచ్చేలా చూడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే వరదకాలువ సీఈ సుమతీదేవీతో మాట్లాడి వరదకాలువకు నీటిని విడుదల చేయించారు.
యాసంగి పంటలకు అవసరమయ్యే విధంగా జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో మరోసారి, మార్చిలో ఇంకోసారి ఇలా మూడుదఫాలుగా వరదకాలువకు రివర్స్పంపిగ్ ద్వారా నీటిని రప్పించడంతో యాసంగి పంటలు గట్టెక్కినట్లయ్యింది. ప్రస్తుతం వరదకాలువ ఎండుముఖం పడుతున్నది. మే నెలాఖరు వరకు గండి పనులు పూర్తయితే కానీ జూన్, జూలైలో వర్షాలు కురిస్తే మళ్లీ వరదకాలువ జలకళ సంతరించుకుని నిండుకుండలా కనిపించే అవకాశం ఉన్నది.