ఎల్లారెడ్డి రూరల్, జూన్ 23: ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మించగా.. ప్రారంభోత్సవానికి ముందే నాణ్యతలోపాలు బయటపడ్డాయి. సుమారు రూ. 4 కోట్ల నిధులతో బస్టాండ్‌ను నిర్మించారు. ఈ నెల 24న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావ్ బస్టాండ్‌ను ప్రారంభించాల్సి ఉండగా.. బస్టాండ్ ప్రహరీ కూలిపోవడంతో పనుల్లో డొల్లతనం బహిర్గతమైంది. సోమవారం బస్టాండ్‌లోకి వచ్చిన మెదక్ డిపోకు చెందిన బస్సు రివర్స్ తీసుకునే క్రమంలో వెనుక బస్టాండ్, బీసీ కాలనీకి మధ్యలో నిర్మించిన ప్రహరీ, రెయిలింగ్ కూలిపోయింది.
అక్కడే ఉన్న పలువురు కేకలు వేయడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఏమాత్రం అలసత్వం వహించినా, ఒక్క ఫీటు బస్సు వెనక్కి వెళ్లినా ప్రహరీకి దగ్గరగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టేది. బస్టాండ్ ఆవరణ చిన్నగా ఉండడం, దానికి తోడు బస్టాండుకు ఆనుకొని బీసీ కాలనీకి చెందిన నివాస గృహాలు ఉండడంతో ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణంపై పేదోడి ఎయిర్పోర్ట్ అంటూ నాయకులు గొప్పగా ప్రచారం చేయడం గమనార్హం.