నిజామాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటరు నమోదుకు పెద్దగా స్పందన రాలేదు. తగిన ప్రచారం లేక కొందరు, ఈసీ నిబంధనల మూలంగా మరికొందరు ఆసక్తి చూపలేదు. ఈసీ ఆదేశాలను బూచీగా చూపి బీఎల్వోలు జిరాక్స్ ప్రతులను అడగడం, పదేపదే ఫోన్లు చేసి సంతకాలకు పిలవడం వంటి ఘటనలతో చాలా మంది అనా సక్తితో ఓటరుగా నమోదు చేసుకునేందుకు వెనుకడుగు వేసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులు ఉంటే వేలల్లో దరఖాస్తులు రావడమే అందుకు నిదర్శనం.
నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈసీ సెప్టెంబర్ 30 నుంచి అవకాశం కల్పించింది. నవంబర్ 6తో గడువు ముగియగా, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులుంటే 29,556 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. 2019తో పోలిస్తే 4,843 మంది ఎక్కువే దరఖాస్తు చేసినప్పటికీ, ఇందులో పరిశీలన తర్వాత ఓటు హక్కు పొందేది ఎంత మంది? అన్నది తేలాల్సి ఉంది. ఇక, కామారెడ్డి జిల్లాలో 15,234 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. బీఎల్వోలు పరిశీలన చేసిన అనంతరం పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు పంపించారు. వీటికి అక్కడే ఆమోదం లభించనుంది.
ఓటు నమోదులో అనేక అనుమానాలు, సందేహాలతో ఈసారి పట్టభద్రులు కొట్టుమిట్టాడినప్పటికీ ఎన్నికల అధికారులు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా నివృత్తి చేసిన దాఖలాలు కనిపించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రచారం కూడా అంతంతే సాగింది. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో ఉన్నతాధికారులు సైతం అంతగా ఆసక్తి చూపిన దాఖలాలు కనిపించలేదు. పట్టభద్రులంతా చదువుకున్న వారే అన్న ఒకే ఒక కారణాన్ని చూపి ప్రచారం చేయకపోవడంతో చాలా మందికి విషయం తెలియక దరఖాస్తు చేయలేకపోయారు.
ఓటరు నమోదు ప్రారంభమైన మొదట్లో ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఆన్లైన్లో ఐప్లె చేశారు. ఫార్మ్ 18 భర్తీ చేసి సర్టిఫికెట్లను అటాచ్ చేశారు. దరఖాస్తుకు ఒక నిర్దేశిత నంబర్‌ను కేటాయించి, అప్లికేషన్ స్టేటస్‌ను తెలుకునేందుకు ఈసీ వెసులుబాటు కల్పించింది. అయితే, వారం రోజులైనా బీఎల్వో వద్దే దరఖాస్తులు పెండింగ్‌లో చూపించడం మొదట్లో కనిపించింది. మరోవైపు, బీఎల్వోలు స్వయంగా దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి సంబంధిత తహసీల్ ఆఫీస్‌కు వచ్చి ఒరిజినల్ అర్హత ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని కోరడంతో పట్టభద్రులు హతాశులయ్యారు.
మరోసారి ఫోన్ చేసి కనీసం జిరాక్స్ పేపర్‌ను ఇవ్వాలని కోరారు. ఇంకోసారి సంతకాలు కావాలంటూ ఫోన్లు చేయడంతో చాలా మంది తమ డ్యూటీలు వదిలి రావడానికి ఇబ్బంది పడ్డారు. ఓటుహక్కు వస్తే రానీ లేకుంటే లేదు అని చాలించుకున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో యూనివర్సిటీలతో సమాచారాన్ని అనుసంధానం చేసుకుని ఉంటే దరఖాస్తుదారుల పరిశీలన సులువు అయ్యేది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసిన వారంతా భౌతికంగా కార్యాలయాల చుట్టూ తిరగడమన్నది ప్రస్తుత ఆధునిక కాలంలో సరైన నిబంధన కానే కాదని పట్టభద్రులు చెబుతున్నారు.
ఓటరు నమోదుకు గడువు ముగియడంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీఎల్వోలు నవంబర్ 13వ తేదీ వరకు పరిశీలన చేపట్టారు. ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి ఫోన్లు చేయకుండానే, కనీసం పరిశీలన కూడా సరిగా చేయకుండానే వచ్చిన దరఖాస్తులకు, స్థానిక ఓటర్ కార్డు(ఎపిక్ కార్డు) నంబర్‌ను పరిశీలించి ఎడాపెడా ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఇదేందని అడిగితే పైనుంచి ఆదేశాలంటూ సమాధానాలు చెబుతుండడం అనేక అనుమానాలు కలిగిస్తున్నది. చివర్లో ఓట్ల ఆమోదానికి బీఎల్వోలు పరిగణనలోకి తీసుకున్న నిబంధనలు ఏమిటి? మొదట్లో తిరస్కరిస్తామంటూ బీఎల్వోలు ఫోన్లు చేయడంలో ఉన్న మర్మం ఏమిటి? అంటూ చాలా మంది పట్టభద్రులు ప్రశ్నిస్తున్నారు.