కంఠేశ్వర్, మార్చి 18 : రైతులను మోసం చేస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డులో వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి పసుపు రైతులను మోసాలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పసుపు రైతుల సమస్యలు, మోసపోతున్న వైనంతోపాటు పదిరోజుల క్రితం అదనపు కలెక్టర్ మార్కెట్ యార్డును సందర్శించి, చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘దగా పడుతున్న పసుపు రైతు’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైంది.
దీనిపై కలెక్టర్ స్పందించారు. అదనపు కలెక్టర్‌ను మార్కెట్ యార్డును సందర్శించాలని ఆదేశించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ మార్కెట్ యార్డును సందర్శించి మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమై రైతులను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన వస్తువును తీసుకురావాలని కోరుతూనే మంచి ధర కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గంగుబాయి, గ్రేడ్ -2 కార్యదర్శి శ్రీధర్, సిబ్బంది ఉన్నారు.