వేల్పూర్/నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 3: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అంతు చిక్కని వైరస్ సోకడం తో ఒక్కో పౌల్ట్రీఫామ్లో వేలాది కోళ్లు మృతి చెందాయి. ఒక్క భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోనే లక్షకు పైగా మృతి చెందడంతో పౌల్ట్రీ రైతు లు లబోదిబోమంటున్నారు. వైరస్ ప్రభావం తో వారం వ్యవధిలోనే దాదాపు అన్ని పౌల్ట్రీఫామ్లు మూతబడ్డాయి. బీర్కూర్ మండలం కిష్టాపూర్లో 2,500 కోళ్లు, చించోలి గ్రామం లో వెయ్యికి పైగా కోళ్లు మృతి చెందాయి.
చనిపోయిన వాటిని ఎక్కడికక్కడ జేసీబీలతో గుంతలు తీసి పూడ్చి వేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి పోషించిన కోళ్లు కండ్ల ముందే కుప్పలుకుప్పలుగా పడి చనిపోతుండడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎందుకు చనిపోతున్నాయో తెలియక, ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. చూస్తుండగానే షెడ్లన్నీ ఖాళీ అవుతుండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక కోళ్ల కంపెనీ ప్రతినిధులు శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించినట్లు తెలిసింది. మరోవైపు, ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం స్పందించడం లేదు.