కోటగిరి, ఏప్రిల్ 3: ‘మూడు విడుతల పాల బిల్లులు ఇంకా ఇయ్యలె.. బిల్లులు రాకపోతే బర్లకు దాణా, గడ్డి ఎలా తీసుకురావాలి? బర్లు కొన్నప్పుడు తీసుకున్న బాకీలు, వాటి కిస్తీలు ఎలా చెల్లించాలి ’ అంటూ పాడి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, విజయ డెయిరీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ పాలు పోసే రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మిర్జాపూర్ క్యాంప్‌లోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బుధవారం ఉదయం పాడి రైతులు పాలు తీసుకొచ్చారు. తమకు మూడు విడుతల బిల్లులు రాలేదని, సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పశువులకు దాణా, గడ్డి ఎలా తీసుకురావాలని అక్కడే ఉన్న సంఘం అధ్యక్షుడు ఉదయ్‌ను అడిగారు. దీంతో పాల బిల్లులపై తానుకూడా సంబంధిత అధికారులను పలుమార్లు అడిగానని, వాళ్లు కూడా వస్తాయని చెబుతున్నారు కానీ పంపడం లేదని రైతులతో చెప్పారు. బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి- పొతంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలను అడ్డంగా పెట్టి నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. స్థానిక ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు ఉదయ్‌తో మాట్లాడారు. ఎస్సై సందీప్ విజయ డెయిరీ డీడీకి ఫోన్ చేసి పాల బిల్లులపై మాట్లాడగా.. తమ చేతిలో ఏం లేదని పైనుంచి వస్తే పంపిస్తామని బదులిచ్చారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే బిల్లులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో నానా కష్టాలు పడుతున్నాం. ప్రతి 15రోజులకోసారి పాల బిల్లలు చెల్లించాలి కానీ, 45రోజుల బిల్లులు ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి మాకు ఇవ్వాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించాలి.
పాల కేంద్రంలో పాలు పోస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. బిల్లులు రాకపోవడంతో పశుగ్రాసం, దాణాకు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. మూడు బిల్లులు అంటే రూ.70 వేలు రావాల్సి ఉన్నది. అధికారులు స్పందించి మూడు విడుతల బిల్లులు వెంటనే ఇవ్వాలి.
పాడి పశువులను పెంచాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కేంద్రంలో పాలు పోసినా సకాలంలో బిల్లులు రావడం లేదు. అధికారులు బిల్లులు చెల్లిస్తే మాకు మేలు జరుగుతుంది. 45 రోజుల నుంచి పాల బిల్లులు చెల్లించలేదు. పశువులకు దాణా, గడ్డి ఇతరాత్ర సామగ్రి తేవాలంటే ఇబ్బంది అవుతుంది. బాకీలు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది.
పాల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పాడి పశువులపై తీసుకున్న రుణాల కిస్తీలు కట్టాలేకపోతున్నాం. మరో పక్క పాడి పశువులకు దాణా,పశుగ్రాసం ఇబ్బంది అవుతుంది. 45రోజుల నుంచి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. అధికారులు స్పందించి బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలి.