నిజామాబాద్ క్రైం, జూన్ 15 : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ రెండో రోజు గురువారం కొనసాగింది. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీహెచ్. ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో అదనపు డీసీపీ (ఏఆర్) విభాగం గిరిరాజు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. రెండో రోజు 650 అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పిలిచారు.
టీఎస్ఎల్పీఆర్బీ-2022 ప్రకారం పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొని, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు, ఈవెంట్స్, ఫిట్నెస్ తదితర అంశాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని ఇన్చార్జి సీపీ తెలిపారు. అభ్యర్థులను పోలీస్‌గ్రౌండ్ ప్రధాన గేట్ వద్ద మెటల్ డిటెక్టర్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం గ్రౌండ్‌లోపలికి అనుమతిస్తున్నారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, మక్సూద్ హైమద్, గోవింద్, సీపీవో, రిజర్వ్, ఐటీ కోర్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.