లింగంపేట(తాడ్వాయి), ఏప్రిల్19: తాడ్వాయి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, ప్రజా సమస్యలపై అలసత్వం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర ఇటీవల పోలీస్ స్టేషన్ సందర్శించిన సమయంలో ఎస్సై అందుబాటులో లేరు.
ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ తగదాల్లో జోక్యం చేసుకున్న ఆరోపణలతో సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఆయన తాడ్వాయి ఎస్సైగా 18నెలలపాటు విధులు నిర్వహించారు. కాగా.. తాడ్వాయి ఎస్సైగా వీఆర్లో ఉన్న రాజయ్యకు బాధ్యతలు అప్పగిస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.