కామారెడ్డి, జూన్ 4: పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ పదేండ్లలో దేశంలోనే నంబర్‌వన్‌గా చేస్తే రెండున్నరేండ్లలోనే రేవంత్‌రెడ్డి సర్వనాశనం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సక్కగా నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై రేవంత్ రెడ్డి రూపంలో ఒక పెద్ద బండరాయి వచ్చి పడిందన్నారు. రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సదస్సులో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎరువులు, యూరియా కొరత లేకుండా రికార్డు స్థాయిలో నిరంతరాయంగా సరఫరా చేశామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ హయాంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర మంత్రులు కేంద్రంపై నెపం నెట్టడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. కేసీఆర్ హయంలోనూ ఇదే కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ, ముందే ప్రణాళికలు రచించి, అన్ సీజన్లోనే స్టాక్ నిల్వలు ఉంచి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూసుకున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకునే రైతు వ్యతిరేక నిర్ణయాలకు రేవంత్‌రెడ్డి వంత పాడుతున్నరని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా కేంద్రం తీసుకొస్తున్న విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్నదని, ప్రధాని మోదీ ప్రతిపాదించిన యూరియా యాప్ విధానాన్ని, అలాగే ఆర్డీఎస్ఎస్ రైతు డిస్కం ఏర్పాటు ప్రతిపాదనను అంగీకరిస్తున్నదని మండిపడ్డారు.

ఆయా ప్రతిపాదనలను వెనక్కి తీసుకునేలా తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. యాప్ విధానాన్ని రద్దు చేసి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు తిరస్కరణపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు చిరునామా అని వేముల ఎద్దేవా చేశారు. రైతు డిస్కమ్ వెనుక రూ.వేల కోట్ల కుంభకోణం ఉందని పేర్కొన్నారు. లాభదాయకమైన విద్యుత్ విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, వ్యవసాయ విద్యుత్ భారాన్ని ప్రభుత్వంపై మోపే కుట్ర జరుగుతుందన్నారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్ భవిష్యత్తులో ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ కోసం సేకరించిన విలువైన భూములను ఫోర్త్ సిటీ పేరిట విక్రయించి భారీ అవినీతికి పాల్పడుతున్నారని వేముల ఆరోపించారు.
మూసి ప్రక్షాళన పేరిట రూ.1.50 లక్షల కోట్ల అవినీతికి తెర లేపుతున్నారన్నారు. పౌరసరఫరాలు, ఎక్పైజ్, ఎండోమెంట్, సింగరేణి, విద్యుత్ వంటి పలు శాఖల్లో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా తయారయిందని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, నేతలు ముజీబొద్దీన్, దఫేదార్ రాజు, సుమిత్రానంద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ధ్యాసే లేదని వేముల మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నించేలా మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు డిక్షనరీలోనే తెలంగాణ అనే పదమే లేదన్నట్లుగా మాట్లాడితే రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఖండించకపోవడం వారి కపటనీతికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ అత్యంత దుర్మార్గంగా మాట్లాడినప్పుడూ రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలుచేయకుండా ప్రజలను వంచనకు గురిచేసింది. తులం బంగారం ఇస్తానని చెప్పి ఆడబిడ్డలను మోసం చేసింది. కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దేవుళ్లపై ఒట్టు వేసి అబద్ధపు హామీలు ఇచ్చిన దుర్మార్గపు సీఎం రేవంత్‌రెడ్డి. దేవుడంటే భయం లేకుండా వాగ్దానాలు చేశారు. రైతులకు రైతుభరోసా ఎగ్గొట్టారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇచ్చింది. ప్రధాని మోదీ 12 ఏండ్లలో గుజరాత్లో ఏడు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చాడు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు చూపిస్తే ముక్కుకు నేల రాస్తానని సవాల్ విసురుతున్న. ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వానికి రైతులు, విద్యార్థులు, మహిళల ఉసురుతగులుతుంది. నియోజకవర్గంలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుదాం. కామారెడ్డి ఉద్యమ గడ్డ. అలాంటి గడ్డ మీద తెలంగాణను తెచ్చిన కేసిఆర్‌ను ఓడించారు.ఈ మచ్చ తొలగిపోవాలంటే కామారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.
ఇందుకోసం ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలి.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు రూ. 8 కోట్లతో డిగ్రీ కళాశాల మైదానంలో నాడు శంకుస్థాపన చేశామని, మళ్లీ మంత్రి సీతక్క ఇందిరాగాంధీ స్టేడియంలో శంకుస్థాపన చేశారని అన్నారు.నాలుగేండ్ల క్రితం మంజూరైనా ఇంతవరకూ స్టేడియం పనులు చేపట్టకపోవడం శోచనీయం.కేసీఆర్ హయాంలో రూ. 23 కోట్లు మంజూరైతే ఆ నిధులతో పనులు చేస్తూ కాంగ్రెస్ నాయకులు తామే తెచ్చుకున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. గతేడాది ఆగస్టులో కామారెడ్డికి వరదలు వస్తే పరిశీలనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 15 రోజుల్లో నివేదిక తెప్పించుకొని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కరూపాయీ రాలేదు. రైతుల సమస్యలపై ఇప్పటివరకూ స్థానిక ఎమ్మెల్యే కల్లాల వద్దకు వెళ్లలేదు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసిందేమిటో చెప్పాలి.
-గంప గోవర్ధన్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే
బీసీ డిక్లరేషన్ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారు. కామారెడ్డికి రెండు మచ్చలు ఏర్పడ్డాయి. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను ఓడించడం, బీసీ డిక్లరేషన్ ఇస్తానన్న ఇవ్వలేని రేవంత్ రెడ్డిని తెచ్చుకోవడం. ఈ మచ్చలు పోవాలంటే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పెంచాలి. ఈసారి సభ్యత్వం నమోదును ఛాలెంజ్‌గా తీసుకొని రాష్ట్రంలోనే కామారెడ్డిలో అత్యధిక సభ్యత్వం నమోదు చేయాలి. కామారెడ్డిలో గులాబీ జెండా ఎగరవేసి కేసిఆర్‌కు బహుమతిగా ఇవ్వాలి.
-జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అబద్ధపు మాటలు చెప్పి గెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదుకుంటే, కాంగ్రెస్ సర్కారు మాత్రం బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలను మోసం చేసింది. కేసీఆర్ దళితబంధు ద్వారా ఎస్సీలను ఆదుకున్నారు. రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజక్టు కింద ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున దళితబంధు ఇచ్చిరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 12 లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరికీ ఇవ్వలేదు. ఎస్సీలు, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చేయలేదు. ఎస్సీలకు అసైన్డ్ భూములు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఎస్సీ,ఎస్టీలకు కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలి. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త కష్టపడాలి.
-హన్మంత్ షిండే, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. కానీ మనందరి నిర్లక్ష్యంతో ప్రభుత్వాన్ని కోల్పోయాం. కేసీఆర్ సీఎంగా లేకపోవడంతో అన్ని కుక్కలు మొరుగుతున్నాయి. ఏం పనీచేయలేని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం గట్టిగా చేస్తే పునాదులు గట్టిగా ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన నాటి నుంచి ఏ ఒక్క పథకం తీసుకురాలేదు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలి.
-బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే