భీమ్‌గల్, ఫిబ్రవరి 6: తాను మంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలతో భీమ్‌గల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న క్రమంలో, రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ దుష్టకాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 4, 8, 2వ వార్డుల్లో వేముల శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌ల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. 2023 ఆగస్టులో పట్టణాభివృద్ధి కోసం రూ. 10 కోట్లు మంజూరు చేయగా, అక్టోబర్‌లో కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా వచ్చాయని తెలిపారు.
ముఖ్యంగా 4,5,6,9,12వ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం రూ. 2 కోట్లు కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ మంజూరైన పనులను కూడా కక్షపూరితంగా రెండేండ్లుగా నిలిపివేసిందని మండిపడ్డారు. పనులు ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో రూ. 40 కోట్లతో 100 పడకల దవాఖాన మంజూరు చేసి 80 శాతం పనులు పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా మిగిలిన పనులు చేయకుండా, దవాఖాను ప్రారంభించడంలేదన్నారు.రూ. 6 కోట్లతో మొదలుపెట్టిన మార్కెట్ పనులతో పాటు భీమ్‌గల్ బస్ డిపోను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. డిపోలో బస్సులు, కంట్రోలర్లు లేరన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నెలకు రూ. 2,500 ఇస్తానని మహిళలను నమ్మించి ఇప్పుడు 25 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అంటే ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 62, 500 చొప్పున బాకీ పడిందన్నారు. అవ్వతాతలకు రూ. 4 వేల పింఛన్ ఇచ్చారా, తులం బంగారం ఎటుపోయిందని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ అందరికీ కాలేదని, రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని చెప్పి పాత రూ. 10 వేలు కూడా సరిగా ఇవ్వడంలేదన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే,కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పుట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గున్నాల బాల లక్ష్మి భగత్, పద్మ దశరథ్, పర్స నవీన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీకి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ పట్టణ ఎన్నికల ఇన్చార్జి, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ గడ్డం సుమనారెడ్డి పాల్గొన్నారు.