మోర్తాడ్, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ భారీ సక్సెస్ కావడం, అనుకున్న దానికంటే ఎక్కువ జనం రావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నదని, అందుకే మంత్రులు, ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా వాగుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సభకు లక్షలాదిగా జనం తరలిరావడం, కేసీఆరే మళ్లీ రావాలి అంటూ నినాదాలు చేస్తూ నిండు మనసుతో మద్దతు తెలపడం చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఆగమేఘాల మీద ప్రెస్మీట్లు పెడుతూ సభ సక్సెస్ కాలేదని స్వీయ ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అని అన్ని పత్రికలు, టీవీలు రాశాయి. అందులో బీఆర్ఎస్కు మద్దతు తెలపని పత్రికలు, టీవీలు కూడా ఉన్నాయని వేముల తెలిపారు. కానీ, కాంగ్రెస్ వాళ్లు మాత్రం కళ్లు ఉండి చూడలేకపోతున్నారన్నారు. 17 నెలల పాలనలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత.. సభకు వచ్చిన లక్షలాది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని, అందరూ మళ్లీ కేసీఆర్ రావాలని అంటున్నారన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను ఇతర యంత్రాంగాన్ని వాడుకుని సభను విజయవంతం కాకుండా కుట్రలు చేయాలని చూశారన్నారు. సభకు చేరుకున్న జనమే కాకుండా మీ కుట్రల వల్ల బయట రోడ్లపై లక్షలాది ప్రజలు ఉండిపోయారని తెలిపారు. కేసీఆర్ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి సునామీల సభకు తరలివచ్చారన్నారు. హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ తప్పించుకోలేదని, ఆ పార్టీ వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తారన్నారు.