భీమ్గల్, ఫిబ్రవరి 13: భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు బీఆర్ఎస్ విజయం సాధించడానికి కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపునకు పొంగిపోబోమని, ఓటమికి కుంగిపోబోమని తెలిపారు. ఓడినా ప్రజల పక్షాన నిలబడి, వారికి ఇచ్చిన హామీల అమలు సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణాభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుని పారదర్శకంగా సేవ చేయాలని సూచించారు.
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 13: ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి గెలిచిందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలదే అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులు, పీఏలు రాత్రింబవళ్లు నోట్ల కట్టలు పంపిణీ చేశారని, మద్యాన్ని ఏరులై పారించారని ఆరోపించారు. 4,6 వార్డుల్లో రిగ్గింగ్ చేయడంవల్లే అక్కడ గెలిచారని జాజాల తెలిపారు. అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిస్తే అది విజయం కాదని, ఎల్లారెడ్డి ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీరును గమనిస్తున్నారని పేర్కొన్నారు.
బిచ్కుంద, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పార్టీ సాంకేతికంగా విజయం సాధించిందే తప్ప నైతికంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవారం ఆయన బిచ్కుందలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో 4,5వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారని, మిగతా వార్డుల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని చెప్పారు. ప్రతి పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల అండ తో 32 శాతం ఓట్లతో నిలిచిందన్నారు. కాంగ్రె స్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ, మద్యం, డబ్బులు, చీర లు పంపి ణీ చేసిందని, అన్ని అవాంతరాలను ఎదుర్కొని బీఆర్ఎస్ అభ్యర్థులు వీరోచితంగా పోటీలో నిలిచారన్నారు.
బోధన్, ఫిబ్రవరి 13: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినా, గెలిచినా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు అనేక వార్డుల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం, మద్యం, డబ్బు పంపకాలతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపించారు. అయినప్పటికీ మెజార్టీ సీట్లు సాధించలేకపోయిందని తెలిపారు. పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని, పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన అన్ని వార్డుల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.