మోర్తాడ్/భీమ్‌గల్, మే 14: తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోబోమని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని, చివరి గింజ కొనే వరకు వెంటాడుతామని, కర్షకులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గురువారం బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం దూద్గాం, మెండోరా, కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, భీమ్‌గల్ మండలం పిప్రి, రెంజర్ల, నాగంపేట్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను వేముల పరిశీలించారు. రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ డీఎం, డీఎస్వోకు ఫోన్ చేసి, కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను ఎండగట్టారు. రైతుల నుంచి చివరి గింజ కొనే వరకు పోరాటాన్ని ఆపేదేలేదని, రైతుల కష్టాలు చూడలేక క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని ఎమ్మెల్యేఅన్నారు.
దూద్గాంలో పది రోజులుగా గన్నీ బ్యాగులు లేవని, లారీలు రావడం లేదని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి మూడు లారీలు మాత్రమే రావడంపై మండిపడ్డారు. కనీసం 50 లారీల ధాన్యం నిల్వ ఉందని, వెంటనే లారీల సంఖ్యను పెంచాలని అధికారులను కోరారు. నిజామాబాద్‌లోని ముకుంద్ రైస్‌మిల్, పాల్ది ట్రేడింగ్ కంపెనీ, సిద్ధిరామేశ్వర రైస్‌మిల్ వాళ్లు సంచికి నాలుగు కిలోల దాకా తరుగు తీస్తున్నారని, వెంటనే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తరుగు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మెండోరాలోని మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సంచుల కొరత కారణంగా కాంటాలు నిలిచిపోయాయని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గతంలో కిసాన్‌నగర్‌కు గన్నీ బ్యాగులు పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మెండోరా గ్రామానికి 1200 సంచులను పంపించాలని కోరారు. చౌట్పల్లిలో నెల రోజులుగా ధాన్యం కుప్పలు రోడ్లపైనే ఉండడం, కొనుగోలు ప్రక్రియ మందకోడిగా సాగడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. రెంజర్ల, నాగంపేట్ గ్రామాల్లో దాదాపు 10 వేల బస్తాలు తూకం వేసి సిద్ధంగా ఉన్నా మిల్లులకు తరలించడానికి లారీలు రాకపోవడంపై మండిపడ్డారు.
పంట కోసి నెల దాటినా మూడు లారీలు మాత్రమే పంపించడమేమిటని నిలదీశారు. ఆఫీసుల్లో కూర్చుంటే ఎట్లా, క్షేత్రస్థాయిలో తిరిగితే కదా రైతుల కష్టాలు తెలిసేది అని తహసీల్దార్‌ను నిలదీశారు. రైతులను ఒక కేంద్రం నుంచి మరొక కేంద్రానికి (నందిపేట్ నుంచి మాక్లూర్, అక్కడి నుంచి మునిపల్లికి)తిప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగంపేట్ బస్టాండ్ వద్ద రెండు లారీలను నిలిపివేసి కిరాయి విషయంలో పేచీ పెడుతున్నారని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రైతులే లారీలు పట్టుకొస్తున్నా వాటిని సరిగా పంపించలేకపోవడం విచారకరమన్నారు. భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలో దాదాపు 80 లారీల ధాన్యం నిల్వ ఉన్నదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యా న్ని మిల్లులకు తరలించాలని డీఎస్వోను కోరారు. వివిధ మండలాలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రేగుంట దేవేందర్, నాయకులు గోపిడి లింగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.