భీమ్‌గల్/ వేల్పూర్/మోర్తాడ్, ఆగస్టు 29: రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బాల్కొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, పంటలు, వంతెనలను అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాథమిక అంచనాల ప్రకారం 1,162 ఎకరాల్లో వరి, 95 ఎకరాల్లో మక్క జొన్న, 35 ఎకరాల్లో సోయా పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారని తెలిపారు. కానీ ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ పంట నష్ట పోయిందని వాపోతున్నారని, ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్న పలు చెరువులు తెగిపోవడంతో బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగుకు వరద ఉధృతి పెరిగి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.
వేల్పూర్, మోతె మధ్యలో కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, దీనిపై నూతన కల్వర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. దీనిపై కల్వర్టు నిర్మాణానికి మళ్లీ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించా రు. భీమ్‌గల్ శివారులోని కప్పల వాగుపై హైలెవల్ వంతెన వరద ఉధృతికి ఒక భాగం పక్కకు జరిగిందని, నష్టం అంచనాలను త్వర గా రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఎస్ఈకి సూచించారు. భీమ్‌గల్, బడాభీమ్‌గల్ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నదని, తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ, పీఆర్, ఇరిగేషన్ శాఖల్లో జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి పంపితే, తాను జరిగిన నష్టంపై మంత్రులకు వివరించి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తామన్నారు.