మోర్తాడ్, జూన్ 23 : ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే అర్హత, స్థాయి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఎంతమాత్రం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌తోపాటు తెలంగాణ ఉద్యమకారులైన కేటీఆర్, హరీశ్‌రావు, కవితపై వ్యక్తిగతంగా దూషిస్తూ, దిగజారి మాట్లాడిన మాటలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.
సింహం లాంటి కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న అర్వింద్ అహంకారానికి ప్రజలు తొందరలోనే పాతరేస్తారని హెచ్చరించారు. 71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడైతే 74 ఏండ్లు ఉన్న మోదీని ఏమనాలని ప్రశ్నించారు. అర్వింద్ తండ్రి డీఎస్ రాజకీయంగా సమాధి అనుకున్న సమయంలో మళ్లీ ఎంపీని చేసి వెలుగులోకి తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు.అర్వింద్ ముఖం చూసి ఎవ రూ ఓట్లు వేయరని, ‘నన్ను చూసి కాదు మోదీని చూసి బీజేపీకి ఓట్లు వేయండి‘ అని అడుక్కొని యాక్సిడెంటల్ ఎంపీ అయ్యావని ఎద్దేవా చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ, జిల్లాకు, నియోజకవర్గ ప్రజలకు అందించిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు.
ఎప్పుడు ఇతరులపై మతి లేని, బూతు మాటలు మాట్లాడుతూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్వింద్‌కు అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఒక్క అంశంపై కూడా సరైన అవగాహన లేదని తెలిపారు. ’బనకచర్ల’ను ’జనకచర్ల’గా అనడం, ఇరిగేషన్ పై అవగాహన లేకుండా ఈ మధ్య అర్వింద్ మాట్లాడిన మాటలు ఆయన విషయ అవగాహన స్థాయిని ప్రజలకు అర్థమయ్యేలా చేశాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై మాట్లాడకుండా ఇంకా బీఆర్ఎస్ పార్టీపై నిత్యం విమర్శలు చేయడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డి ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందడానికే బీజేపీ ఎంపీలు ఇంకా బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కులు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం నిత్యం పోరాడుతుంటే, బీజేపీ ఎంపీలు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
అనేక అంశాల్లో వారి పార్టీల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ముందు వారి పార్టీని చక్కదిద్దుకోవాలని, తర్వాత ఇంకొకరి మీద ఏడవాలని సూచించారు. అధికార మదంతో అహంభావంతో విర్రవీగుతున్నావని, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, సమయం వచ్చినప్పుడు వారే అర్వింద్ అహంభావాన్ని రాజకీయంగా పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు.