మోర్తాడ్/ఏర్గట్ల, జూలై 26: గ్రామాభివృది ్ధకమిటీలు గ్రామాభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని జిల్లా జడ్జి భరతలక్ష్మి సూచించారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంతోపాటు ఏర్గట్ల మం డలం తాళ్లరాంపూర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథులుగా జిల్లా జడ్జి భరత లక్ష్మి, సీపీ సాయిచైతన్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ… ఆర్మూర్ ప్రాంతంలోనే గ్రామాభివృద్ధి కమిటీలు కనిపిస్తున్నాయని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేయడంలో తప్పులేదని, కానీ చట్టాలను చేతిలోకి తీసుకుని బహిష్కరణలు చేయడం, జరిమానా విధించడంలాంటివి చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పేరిట పెత్తనం చెలాయించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మానుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కల్తీకల్లుతో ప్రమాదాలు తెచ్చుకోవద్దని హితవుపలికారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని, న్యాయస్థానాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
-సీపీ సాయి చైతన్య
సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. తాళ్లరాంపూర్ లో మహిళలకు ఆలయంలో జరిగిన అవమానం తన మనస్సును కలిచి వేసిందన్నారు. ఇలాంటి హేయమైన చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. వీడీసీలు చట్టాన్ని అతిక్రమిస్తే వారికి పాస్‌పోర్టు ధ్రువీకరణలో నెగిటివ్ చేసి పాస్‌పోర్టు రాకుండా చేస్తామని హెచ్చరించారు. వారి పిల్లలకు లైసెన్సులు రాకుండా చేస్తామన్నారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కింద ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ కోర్టు జడ్జిలు శ్రీదేవి, సరళారాణి, ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.