రామారెడ్డి, నవంబర్ 16 : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రౌడీల పాలన కొనసాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని రంగంపేటకు చెందిన మహ్మద్ అనీఫ్ కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్మోహన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, తన ఫొటోలను వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్నందుకు కాంగ్రెస్ కార్యకర్త అనీఫ్పై ఎమ్మెల్యే మదన్మోహన్ అనుచరులు శుక్రవారం దాడి చేసి, ఆయన కుటుంబాన్ని బెదిరించారన్నారు.
దీంతో అతడి తల్లి గుండెపోటుకు గురయ్యారన్నారు. దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడారని ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిన్ను ఎందుకు గెలిపించామని ఎల్లారెడ్డి ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని తెలిపారు. మదన్మోహన్ ఒంటెద్దు పోకడలతోనే అసెంబ్లీ కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో 40 వేల మెజారిటీ తగ్గిపోయిందన్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీల్లోని ఫొటోలపై రాజకీయం చేయడం మానుకుని.. ఎల్లారెడ్డిలో పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టిపెట్టాలని మదన్మోహన్కు సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.