ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 5: యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సొసైటీ గోదాముల వద్ద నిత్యం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్దకు యూరియా కోసం ఉదయం 5 గంటలకే రైతులు తరలివచ్చారు. గోదాం వద్ద పాస్ పుస్తకాలు వరుసలో పెట్టి పడిగాపులు కాశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు యూరియా దొరకలేదని పలువురు రైతులు వాపోయారు.
ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క పట్టాపాస్పుస్తకానికి రెండు బస్తాల యూరియాను మాత్రమే ఇస్తున్నారని, చాలకపోతే మరో విడుతలో ఇస్తామని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. ఉదయం నుంచి భోజనం కూడా చేయకుండా యూరియా కోసం గో దాం వద్ద పడిగాపులు కాశామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వరుసలో ఉండగానే ఫోన్లలో మాట్లాడిన కొందరికి మాత్రం నేరుగా యూరి యా వెళ్లిపోతుందని ఆరోపించారు. వరుసలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని కోరారు.
తిండి తిప్పలు లేకుండా వరుసలో ఉన్న..
యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా లైన్లో ఉదయం నుంచి ఉన్న. నాకు ఒకే పట్టా పుస్తకంపై నాలుగు ఎకరాల పొలం ఉన్నది. సొసైటీ సిబ్బంది పుస్తకానికి రెండు సంచుల యూరియా చొప్పున మాత్రమే ఇస్తామంటున్నరు. మరి మిగతా మూడు ఎకరాల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలె. మల్ల స్టాక్ వచ్చినప్పుడు ఇస్తమని అంటున్నరు. ఇదెక్కడి న్యాయం. ఎకరానికి రెండు సంచుల చొప్పున నాకు 4 ఎకరాలకు 8 సంచుల యూరియా ఇవ్వాలి.
-విస్లావత్ రాజు, రైతు, సోమార్పేట్
ఫోన్ చేసిన వారికి యూరియా ఇచ్చామనడం కరెక్ట్ కాదు
రైతులు వరుసలో ఉండగా, ఫోన్ చేసిన వారికి యూరియా ఇచ్చామనడం కరెక్ట్ కాదు. అలా ఎవరికి ఇచ్చామో రైతులు తెలియజేయాలి. ఎకరానికి రెండు సంచుల యూరియాను మూడు విడుతల్లో చల్లుతారు. ఇది కొందరికి రెండో విడుత, మరికొందరికి మూడో విడుత కావొచ్చు. అందువల్ల వారు ఏ విడుతలో ఎంత యూరియా తీసుకున్నారో వారి పుస్తకాలను చూస్తేనే తెలుస్తుంది. అందువల్ల రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేదనడం సమంజసం కాదు.
-ఎండీ నదీమొద్దీన్,ఎల్లారెడ్డి మండల వ్యవసాయాధికారి
పని మానేసి యూరియా కోసం వచ్చిన..
నేను పొలం పనులు చేసుకుంటూ మరోవైపు దుకాణంలో జీతం చేస్తున్న. మాకు గ్రామ శివారులో రెండు జాగలల్ల కలిపి నాలుగెకరాల భూమి ఉన్నది. యూరి యా ఇస్తున్నరు అని తెలియగానే దుకాణానికి వెళ్లకుండా పని మానేసి పొద్దున నుంచి క్యూలో నిల్చున్న. పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే కూర్చోవాల్సి వస్తున్నది.
-గట్టుమీది ప్రవీణ్, రైతు, కొత్తపల్లి