ముప్కాల్, జూన్ 28: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితులు దాపురించాయి. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో శనివారం ఇలాంటి దృశ్యమే కనిపించింది. యూరియా లోడ్ రావడంతో రైతులు, మహిళలు తరలివచ్చారు. చెప్పులు లైన్లో పెట్టి పొద్దంతా పడిగాపులు కాశారు. రాత్రి 8 గంటల దాకా వేచి ఉన్నప్పటికీ కొంతమందికి యూరియా సంచులు దక్కలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఇంటి ముఖం పట్టారు.
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడింది. ఎరువుల కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. అరకొరగా వచ్చే యూరియా స్టాక్ కోసం పొద్దంతా పడిగాపులు కాస్తున్నది. శనివారం యూరియా వచ్చిందని తెలిసి రెంజర్ల వాసులు పనులు మానుకుని తరలి వచ్చారు. చెప్పులు వరుసలో పెట్టి పొద్దంతా నిరీక్షించారు. రెండు లారీల్లో 40 టన్నుల యూరియా రాగా, రెంజర్లకు 900, వెంచిర్యాల్కు 450, నాగంపేట్కు 450 చొప్పున సంచులను తరలించారు. అయితే, సరిపడా స్టాక్ రాకపోవడంతో రైతులందరికీ యూరియా అందలేదు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు పడిగాపులు కాసినా యూరియా సంచులు దొరకలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగుండె. ఎప్పుడంటే అప్పుడు యూరియా దొరుకుతుండె. కాంగ్రెసోళ్లు అచ్చినంక మళ్లీ కష్టాలు మొదలైనయ్’ అని వాపోయారు.
మరోవైపు, యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు చెప్పులు వరుసలో పెట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. కాంగ్రెస్ తెస్తామన్న మార్పు ఇదేనేమో అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక పాత రోజులు వచ్చాయన్నారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు రాజులాగా షాప్ అతనికి ఫోన్ చేసి, బండి మీద రయ్యుమంటూ వచ్చి యూరియా తీసుకెళ్లే వారమని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో యూరియా కోసం రోడ్డున పడ్డామని అక్కడికి వచ్చిన రైతులందరూ కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు. ఇప్పుటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని’ వేముల డిమాండ్ చేశారు.