నిజామాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు కర్షకులను విస్మరిస్తున్నది. ప్రభుత్వానికి ముందస్తు చూపు కరువైన తరుణంలో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట అద ను దాటుతున్నదని, సరిపడా యూరి యా సరఫరా చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు దిగుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాత రోజులు పునరావృతమవుతున్నాయి. ఎరువుల కోసం చెప్పులు, పాస్‌బుక్ జిరాక్స్‌లు వరుసలో పెట్టే రోజులు మళ్లీ దాపురించాయి. ఇటీవల సాగుచేసిన మక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయం ఆసన్నమైంది. యూరియా కోసం రైతులు సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, పాస్‌బుక్ జిరాక్స్‌లు లైన్లో పెట్టి పొద్దంతా పనులు మానుకుని వేచి ఉంటున్నారు. అయినా వారికి ఒకటి, రెండు సంచులకు మించి దొరకడం లేదు. అరకొర సరఫరా రైతుల అవసరాలను తీర్చడం లేదు.
సహకార శాఖ అధికారుల మాయాజాలానికి తోడు వ్యవసాయశాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతుంటే, మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం విడ్డూరంగా మారింది. యూరియా కొరతపై వారం క్రితమే ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించగా, సహకార శాఖ వితండ వాదం చేసింది. అసలు కొరతే లేదంటూ బుకాయించింది. కానీ ఇప్పుడు వారం రోజులుగా జిల్లాలో ఎక్కడో ఒకచోట రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
ఎరువులు ఇవ్వాలని ధర్నాలు చేస్తుంటే మాత్రం కిమ్మనడం లేదు. ఇక, కొన్ని సహకార సంఘాల్లో అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహకార శాఖలో పాతుకుపోయిన కొంతమంది అధికారులు, సిబ్బంది రైతుల నుంచి అధికంగా డబ్బులు గుంజేందుకు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ, సహకార శాఖల ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, డీలర్లతో మామూలు వ్యవహారాలు నడుపుతుండడం రైతులకు సంకటంగా మారింది.
నిజామాబాద్ జిల్లా రైతాంగానికి 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. ఇప్పటి వరకు 42 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇందులో 26 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడు పోయిందని, ఇంకా 16 వేల మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలాచోట్ల యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు 68,654 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 8,122 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అరకొర సరఫరా కారణంగా రైతుల అవసరాలు ఏ మాత్రం తీరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కుతున్నారు.
రైతులు అడుక్కునేటోల్ల మాదిరిగ జేత్తుండు గీ రేవంతు. అన్నం పెట్టే రైతు మాయసుంటి ముసలోల్లను పాసుబుక్కు పట్టుకుని గీడ గంటలు గంటలు నిలవెడుతున్నరు ఎరువుల సంచుల కోసం. ఒక్కొక్కరికీ రెండు సంచులు ఇస్తే ఇంట్ల ఉన్న ముసలోన్ని తీసుకొచ్చి ఇడ లైన్లు గట్టుడున్నది. కేసీఆర్ సారున్నప్పుడే మంచిగుండే. మాకు పింఛనిచ్చుడుతో ఇంట్లో ఆరాంగా ఉన్నం. గిప్పుడు రేవంత్ వచ్చి మమ్ములను సంపుతుండు..
-గొర్రె చిన్న రాజన్న, రైతు, ముప్కాల్
ముప్కాల్, జూలై 2: రైతులకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం దళారులు, దోపిడీ దొంగల చేతిలోకి వెళ్లిపోయిందనడానికి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలే నిదర్శనం. రైతు కంట కన్నీరు కార్చుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిలేదు. పొద్దున లేచి పొలం పనులకు వెళ్లాలో లేక ఎరువుల కోసం గంటల తరబడి లైన్లో నిలబడాలో అర్థమైతలేదు. లైన్లో లేకపోతే ఎరువుల దొరకవేమోనని కంగారుగా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఎవుసం చేయలేక పోతున్నాం.
-కందుల శంకర్, రైతు, ముప్కాల్
నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత అన్నదే లేదు. రైతులు ఆందోళన చెందొద్దు. జిల్లాకు 42 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాగా, 26 వేల మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే 6 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా అమ్ముడైంది. అయితే, ఎరువుల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లుంది. పంపిణీలో ఇక్కట్లు లేకుండా చూస్తాం.
వానకాలం సాగుకు ముందే ప్రభుత్వం సమాయత్తం కావాలి. సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. కానీ కాంగ్రెస్ సర్కారుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేవి. అదను రాగానే సొసైటీలకు వెళ్లి యూరియా తీసుకునే వారు. నాడు కొరత అన్నదే లేకుండా యూరియా ఫుల్లుగా ఉంటే, నేడు చాలా సొసైటీల్లో స్టాక్ నిల్ అని చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా పంటలు పండించుకున్న రైతులు.. ఇప్పుడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తున్నదని అన్నదాతలు చెబుతున్నారు.