‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం’ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా అన్నారు. దళిత బంధు అమలు తీరుపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు శనివారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ పైలట్ ప్రాజెక్టు కింద పలుచోట్ల ఈ పథకాన్ని అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో స్వయంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాం.
ఎస్సీ రిజర్వుడ్ డివిజన్లలో దళితబంధును అమలు చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అర్బన్ నియోజకవర్గం మొత్తం విస్తరించనున్నాం. ప్రస్తుతానికి నగరంలోని 9, 37, 38, 50 డివిజన్లలో 100 యూనిట్లు గుర్తిస్తున్నాం’ అని గణేశ్ గుప్తా వివరించారు. నియోజకవర్గంలో ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులు రాబోయే రోజుల్లో మిగిలిన వారందరికీ ఆదర్శంగా నిలవాలి. తమకున్న నైపుణ్యాల ఆధారంగా యూనిట్లను ఎంపిక చేసుకోవాలి. ఈ విడుతలో విజయవంతమైన వారంతా మిగిలిన వారికి స్ఫూర్తిని అందించాలనేది తన లక్ష్యమని తెలిపారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
‘దళితబంధు పథకంతో ఊహించని ఫలితాలు వస్తాయి. ప్రయోగాత్మకంగా ఆరు నెలల క్రితం హుజూరాబాద్‌లో అమలైన పథకంమూలంగా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రమే కాదు… యావత్ దేశంలో దళితబంధు పథకం అమలుపై ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. పలు చోట్ల దళితబంధు యూనిట్ల పంపిణీతో సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 యూనిట్లు మంజూరు చేసి పేద దళిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ తలచారు.
ప్రభుత్వ ఆదేశాలతో తానే స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొని లబ్ధిదారుల ఎంపిక చేపట్టాను’ అని దళితబంధు పథకం అమలు తీరుపై చెప్పుకొచ్చారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా. అర్బన్ నియోజకవర్గంలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోయే వంద యూనిట్లను అత్యంత నిరుపేదలకే అందిస్తామంటున్నారు. ఎస్సీ రిజర్వుడ్ డివిజన్లలో దళితబంధును అమలు చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అర్బన్ నియోజకవర్గం మొత్తం విస్తరించనున్నట్లుగా చెప్పారు. పూర్తిగా పట్టణ ప్రాంతమైన నిజామాబాద్ అర్బన్లోనూ ఆయా డివిజన్లలో నివసిస్తున్న దళిత కుటుంబాల జీవన పరిస్థితులపై సమగ్ర సర్వేను సైతం చేపట్టినట్లుగా “నమస్తే తెలంగాణ” ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మనిషి ఖండాంతరాలను నిమిషాల్లో దాటుతున్నాడు. అంతరిక్షంలో అడుగు పెడుతున్నాడు. శాస్త్ర, సాంకేతిక రంగంలో రోజుకో కొత్త విషయాన్ని కనుక్కుంటున్నా డు. అయినప్పటికీ దేశంలో సామాజిక వివక్ష నేటికీ కనిపించడం దురదృష్టం. అర్బన్‌లో భవన నిర్మాణ రంగం, కుటీర పరిశ్రమలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పిండి గిర్నీలు, కిరాణా షాపులు, రవాణా వాహనాలు లాంటివి తోడ్పాటును అందిస్తాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులు రాబోయే రోజుల్లోనే మిగిలిన వారందరికీ ఆదర్శంగా నిలవాలి. తమకున్న నైపుణ్యాల ఆధారంగా యూనిట్లు ఎంపిక చేసుకోవాలి. ఈ విడుతలో విజయవంతమై వారంతా మిగిలిన వారికి స్ఫూర్తిని అందించాలనేది నా అభిప్రాయం.
స్వతంత్ర భారతదేశంలో నేటికీ తిండికి తిప్పలు పడే దళిత కుటుంబాలుండడం దురదృష్టం. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తే అవి ఎటూ సరిపోయేవి కావు. వారి బతుకులను రోడ్డున పడేసే పథకాలుగా ఉండేవి. పది లక్షల రూపాయలను నేరుగా లబ్ధిదారుడికి అందించి జీవనోపాధి చూపిస్తున్న ఈ పథకాన్ని రూపకల్పన చేయడం గొప్ప విషయం. దళిత మేధావులు, దళిత సంఘాలతో మేధోమథనం నిర్వహించిన అనంతరం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అన్ని వర్గాల ప్రజలు ఈ పథకం అమలును స్వాగతిస్తున్నారు.
రాష్ట్రంలో పూర్తి పట్టణ ప్రాంతంతో నియోజకవర్గంగా ఉన్న ప్రాంతాల్లో నా నియోజకవర్గం ఒకటి. పట్టణ జనాభాతోనే అర్బన్ నియోజకవర్గం ఆవరించి ఉంది. గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి సారూప్యత చాలా ఉంటుంది. పట్టణాల్లో నివసించే ప్రజలకు వ్యవసాయ రంగంపై కనీస అవగాహన ఉండదు. కాసింత పరిజ్ఞానం ఉన్నప్పటికీ పట్టు సాధించడం కష్టం. అందుకే వీరికి అనువైన యూనిట్ల స్థాపనకు విశేషంగా ప్రయత్నాలు చేపడుతున్నాం. ప్రధానంగా అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని స్వయం ఉపాధి పొందేలా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. మేము ఎన్ని యూనిట్లు ప్రతిపాదనలు పెట్టినప్పటికీ అల్టిమేట్‌గా లబ్ధిదారుడి ఇష్టమే ఫైనల్. వారికి ఏది నచ్చితే అదే మంజూరు చేస్తాం.
బిగాల : నిజామాబాద్ అర్బన్‌లో దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాము. అత్యంత పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వారినే ఇందుకోసం ఎంపిక చేస్తున్నాం. లబ్ధిదారుడికి, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్, నేను కేవ లం అనుసంధానకర్తగా ఉంటాం. మిగిలిన వారెవ్వరికీ ఇందులో అవకాశం లేదు. అధికార యంత్రాంగం సలహాలు, సూచనలు అందిస్తుంది. నిజామాబాద్ అర్బన్‌లో మొత్తం 60 డివిజన్లుంటే ఇందులో కొన్ని డివిజన్లు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లోకి వెళ్తున్నాయి. నా పరిధిలో ఉన్న డివిజన్లలో ఎస్సీ రిజర్వ్డు ప్రాంతాలను తొలి విడుత ఎంపిక చేస్తున్నాం. డివిజన్లు 9, 37, 38, 50లలో 100 యూనిట్లు గుర్తిస్తున్నాం. వచ్చే ఏడాది నియోజకవర్గం మొత్తం దళితబంధు పథకాన్ని విస్తరింపజేస్తాం.
గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. దళితబంధు పథకం ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమం. సీఎం కేసీఆర్ ఆశామాషీగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా వందశాతం రాయితీతో రూ.10లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఇలాంటి పథకాలను నేను గతంలో ఎక్కడ, ఎప్పుడూ చూడలేదు. సమాజంలో వివక్షకు గురవుతున్న వారిని ఆర్థికంగా ఉన్నతికి తీసుకురావాలనే ఆలోచనతో దళితబంధు పథకాన్ని కేసీఆర్ తీసుకువచ్చారు.
దళితబంధు పథకం ప్రస్తుతం నియోజకవర్గంలో వంద మందికి అమలు కానున్నది. దశల వారీగా అందరికీ ఈ పథకం చేరుతుంది. లబ్ధిదారులు నివసిస్తున్న ఆయా డివిజన్లకు కమిటీలను నియమించబోతున్నాం.డివిజన్ల వారీగా అధికారులు సమన్వయకర్తలుగా ఉంటారు. లబ్ధిదారులకు సాంకేతికంగా, క్షేత్రస్థాయిలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఇన్చార్జీలు సహకరిస్తారు. తప్పకుండా ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తాను. వారికి పూర్తి మద్దతుగా సహాయ, సహకారాలు అందిస్తాను.
అర్బన్ నియోజకవర్గం పరిధిలో 3,55,081 మంది జనాభా ఉన్నారు. ఇందులో ఎస్సీలు 29,444 మంది ఉన్నట్లుగా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా 8.29 శాతంగా ఉం ది. డివిజన్ల వారీగా ఎస్సీ కుటుంబాలు, జనాభా లెక్కలను సేకరించాం. వారి ఆర్థిక స్థితిగతులపైనా అధికార యంత్రాం గం సమగ్ర సర్వేను చేపట్టింది. వారి జీవన ప్రమాణాలు, ఉపాధి మార్గాలు, విద్యా, ఆరోగ్యం వం టి అంశాలపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వ యం త్రాంగం సేకరించింది.