స్వరాష్ట్రంలో పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడిన బల్దియాలు ప్రస్తుతం అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. జనాభా ప్రాతిపదికన కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తుండ డంతో సుందరంగా మారాయి. ఇరుకైన రహదారుల స్థానంలో విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్‌తో కొత్త రూపును సంతరించుకున్నాయి. ప్రకృతివనాలు, ఓపెన్జిమ్లతో పట్టణాలు కొత్త సొబగులు అద్దుకున్నాయి. ఏండ్లుగా సమస్యలతో కొట్టుమిట్టాడిన పట్టణాలు ‘ప్రగతి’కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
రోజురోజుకూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ చర్యలతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడడంతోపాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, మెరుగైన పౌర సేవలను అందిస్తున్నది. మంజూరు చేసిన నిధులతో మున్సిపల్, కార్పొరేషన్లలో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నది. శ్మశాన వాటికలను ఆధునిక వసతులతో వైకుంఠధామాలుగా మారుస్తున్నది. పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దడంతో పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పట్టణ ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థపై ప్రత్యేక కథనం..

Nizamabad5
కామారెడ్డిలో ప్రగతి కాంతులు
కామారెడ్డి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతిని నిర్వహిస్తూ పట్టణాల అభివృద్ధికి దోహదపడుతున్నది. పట్టణ ప్రగతిని ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తున్నది. కామారెడ్డి పట్టణంలో నాలుగు విడుతల్లో నిర్వహించిన కార్యక్రమంతో 49వార్డుల రూపురేఖలు మారాయి. పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు,డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణం, విద్యుత్ స్తంభాల మరమ్మతులు, ఇంటి పన్నుల వసూలు తదితర కార్యక్రమాలను నిర్వహించింది. పల్లెలకు ధీటుగా పట్టణాల్లో సైతం ప్రగతిలో దూసుకపోవడానికి వార్డులన్నీ శుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకున్నది. మురికి కాలువల నుంచి దుర్గంధం వెదజల్లకుండా, నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
పట్టణ ప్రగతిలో అభివృద్ధి పనులు :
రూ.8.14 కోట్లతో బాన్సువాడ ప్రగతి
బాన్సువాడ, జూన్ 15: సమైక్య పాలనలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న బాన్సువాడ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారం, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక కృషితో 2018 జనవరిలో మున్సిపాలిటీగా మారింది. సుమారు 45 వేలకుపైగా జనాభా ఉండడంతో పట్టణాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ.వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో బాన్సువాడ రూపురేఖలు మారాయి. పట్టణ ప్రగతిలో బాన్సువాడ పట్టణానికి ఇప్పటి వరకు రూ.8 కోట్ల 14 లక్షలు మంజూరయ్యాయి. రూ.20లక్షలతో డీఆర్సీసీ, రూ.25లక్షలతో ఐదు ఆటోలు, రూ.27లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్, రూ.5లక్షలతో ఓపెన్ జిమ్, రూ.23లక్షలతో రెండు పార్కులు, రూ.30లక్షలతో వైకుంఠధామం, రూ.98లక్షలతో సీసీ డ్రైనేజీలు, రూ.8లక్షలతో సీసీ చార్జింగ్ కరెంట్ బిల్లులు, రూ.16లక్షలతో రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. హరితహారంలో భాగంగా రూ.28లక్షలతో మొక్కలను నాటించారు. రూ.16లక్షలతో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతోపాటు రూ.20లక్షలతో తాగునీటి సరఫరా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
కొంగొత్తగా..భీమ్‌గల్
భీమ్‌గల్, జూన్ 15: సమైక్య పాలనలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన భీమ్‌గల్ నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా మార్చారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మౌలిక వసతుల కల్పనకు రూ.25కోట్లు మంజూరు చేసింది. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులతో భీమ్‌గల్ కొంగొత్తగా మారింది. పట్టణంలో ఉన్న డబుల్ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా మారడంతోపాటు సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. రూ.కోటితో అన్ని మతాలకు వైకుంఠధామాలను నిర్మించారు. రూ.50లక్షలతో ఎఫ్ఎస్టీసీని ఏర్పాటు చేశారు. రూ.30లక్షలతో నాలుగు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. మంత్రి వేముల రూ.6 కోట్ల నిధులను మంజూరు చేయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.రూ.75 లక్షలతో అర్బన్ పార్కు పనులు కొనసాగుతున్నాయి. రూ.5.50కోట్లతో తాగునీటి కుళాయిలను బిగించారు. పట్టణంలోని 12 వార్డుల్లో 2000ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా చెత్త సేకరణకు ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ప్రజల సౌలభ్యం కోసం రూ.3కోట్లతో వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం కొనసాగుతున్నది.
ఇందూరు ప్రగతి జోర్దార్..
ఖలీల్‌వాడి, జూన్ 15: రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిజామాబాద్ నగర పాలక సంస్థగా మారింది. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో ప్రగతి వైపు పరుగులు పెట్టింది. పట్టణ ప్రగతి కార్యక్రమంతో నిజామాబాద్ మరింత అభివృద్ధి సాధించింది. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. తాగునీటి ట్యాంకులు, పార్కుల నిర్మాణం, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఓపెన్ జిమ్‌లు తదితర పనులు చేపట్టారు. పట్టణ ప్రగతితోపాటు ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కృషితో మంజూరైన నిధులతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
బోధన్ ప్రగతి భేష్..
శక్కర్‌నగర్, జూన్ 15: బోధన్ పట్టణానికి నాలుగు విడుతలుగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా రూ.10.53 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రూ.398లక్షలతో 12 నర్సరీలు, 38 పట్టణ ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 40 వాహనాలను పెంచారు. రూ.52.5 లక్షలతో ఆరు మరుగుదొడ్లను నిర్మించారు. రూ.1.4 కోట్లతో (ఎఫ్ఎస్టీపీ) ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పనులు చేపట్టారు. లక్షల వ్యయంతో సుందరవనాలతో కూడిన వైకుంఠధామాలను నిర్మించారు. ఐదు ఓపెన్ జిమ్‌లు, రెండు క్రీడా ప్రాంగణాలను రూ.46లక్షలతో ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌కాంతులతో మెరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి టీయూఐఎఫ్డీసీని ఏర్పాటు చేసి రూ.26.63 కోట్లను విడుదల చేసింది. రూ. 13లక్షలతో శక్కర్‌నగర్‌లో ‘బస్తీ దవాఖాన’ను ప్రారంభించారు. ప్రగతి పనులతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నది.
అభివృద్ధి పథంలో…ఆర్మూర్
ఆర్మూర్, జూన్ 15: సమైక్య రాష్ట్రంలో అరకొర నిధులతో పట్టణాభివృద్ధి కుంటుపడగా స్వరాష్ట్రంలో నిధుల వరదతో ఆర్మూర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఆర్మూర్‌లో ప్రగతి పరుగులు పెట్టిస్తున్నారు. ఏ కాలనీకి వెళ్లినా అందమైన సీసీ, బీటీ రోడ్లు, క్రమబద్ధీకరించి నిర్మించిన మురికికాలువలు కనబడుతున్నాయి. రూ.20కోట్ల40లక్షలతో సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పర్యాటక శోభను సంతరించుకున్నది. మిషన్ భగీరథ పథకం కింద రూ.508కోట్లతో పట్టణంలో 57వేల నల్లా కనెక్షన్లు ఇచ్చారు. పట్టణ శివారులోని గుండ్ల చెరువును రూ. కోటి 56లక్షలతో ఆధునీకరించి బోటింగ్‌ను ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపాలిటీ నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు డివైడర్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో రాత్రి సైతం పగలుగా మారింది. జర్నలిస్టు కాలనీ రోడ్డులోని క్లాక్ టవర్, దాని ముందు భారీ జాతీయ జెండా ఏర్పాటుతో ఆర్మూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.50లక్షలతో పార్కు ఏర్పాటు, ఒక్కో ఓపెన్ జిమ్‌కు రూ.5.10లక్షలతో మొత్తం 11 జిమ్‌లు ఏర్పాటు చేయగా, మరో 20 జిమ్‌లు ప్రతిపాదనల్లో ఉన్నాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ఆధునీకరణతో ఆర్మూర్ పట్టణ రూపురేఖలు మారాయి.