వేల్పూర్/ముప్కాల్, మే 23 : ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యే దశకు చేరుకోగా అకాల వర్షాలకు ధాన్యం తడిసిముద్దవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొనడంతో వడ్లకు మొలకలు వస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, ముప్కాల్ మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది.
కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయి, మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం తడిసిపోయి తాము నష్టపోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి రోడ్లపై ఆరబోసిన వడ్లకు మొలకలు వచ్చాయని వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన తాల్కల చిన్న రాజన్న ఆవేదన వ్యక్తంచేశాడు. వరుసగా కురుస్తున్న వర్షాలకు వడ్లకు మొలకలు వస్తున్నాయని ముప్కాల్ మండలానికి చెందిన దండుగుల పోశెట్టి అనే కౌలు రైతు కూడా వాపోయాడు. అటు ప్రభుత్వం, ఇటు సీడ్ ఇచ్చిన వారు కూడా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఆర్మూర్‌టౌన్, మే 23: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణంలోని గోవింద్‌పేట్ చౌరస్తా వద్ద ధాన్యం సంచులతో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలన్నారు.
కొనుగోలుకేంద్రాల్లో ధాన్యం కాంటా చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. దీనిపై అధికారులను సంప్రదిస్తే హమాలీల కొరత వల్ల జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారని, గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడంలేదన్నారు. ఇక్కడికి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రావాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో రాజాగౌడ్ అక్కడికి చేరుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారయణ గౌడ్ సిబ్బందితో వచ్చి క్లియర్ చేశారు.