లింగంపేట, ఏప్రిల్13: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, లింగంపేట గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు తోడు వడగండ్లు కురియడంతో రైతుల ఆందోళనకు గురయ్యారు.
ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పినా, వర్షం నీరు చేరింది. మండలంలోని ఆయా గ్రామాల్లో 20 రోజుల క్రితం వరి కోతలు ఆరంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ తూకం వేయక పోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టారు. తూకం ప్రారంభించే సమయంలోఆకాల వర్షంతో ధాన్యం తడిసిపోయింది. సహకార సంఘం అధికారులు వెంటనే తూకం ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.