Nizamabad | వినాయక నగర్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ముఖం గుర్తుపట్టరాకుండా బండరాయితో కొట్టి దుండగులు చంపేశారు. పాంగ్ర బోర్గం బ్రిడ్జి పక్కన ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, నగర సీఐ శ్రీనివాస్‌రాజ్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోమవారం రాత్రి సమయంలో హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో మృతుని వివరాల కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. మృతదేహం కుడి చేతిపై సింహం గుర్తులో పట్టబొట్టు ఉండటంతో దాని ద్వారా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనాస్థలిక కొద్దిదూరంలోనే కల్లుబట్టి ఉండటంతో సోమవారం రాత్రి అక్కడకు వచ్చిన వ్యక్తుల మధ్య ఏదైనా ఘర్షణ జరిగి అది కాస్త మర్డర్‌కు దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీకాంత్ నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హంతకులను గుర్తించేందుకు పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.