కంఠేశ్వర్, జూలై 6 : ఉద్యోగాల నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యతోపాటు అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సోమవారం తెలంగాణ సామాజిక ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ‘నిరుద్యోగ యువతకు న్యాయం చేయండి.. నియామకాలను చేపట్టండి.. నిరుద్యోగుల భవిష్యత్తును కాపాడండి.. ’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుళ్లు అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 36 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ నియామకాలు ఐదు వేలు కాకుండా కనీసం 20 వేల పోస్టులతో పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది యువకులు పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని, నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. వెంటనే హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. కేవ లం ఐదువేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే, లక్షలాది మందికి అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగ యువతను మోసం చేస్తారా?
-సాయినాథ్ , నిరుద్యోగి
ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవ హరించి నిరుద్యోగులను ఆదు కోవాలి. కనీసం 20వేల నియా మక పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేని పక్షం లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతాం.
-రాంచందర్‌నాయక్ తెలంగాణ సామాజిక ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు
పోలీస్కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు పెంచాలి. పోస్టుల సంఖ్యను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసి, పోస్టులను భర్తీ చేయాలని. యువత భవిష్యత్తును కాపాడాలి.
-అనిల్, నిరుద్యోగి
ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవాలి. మా పోరాటం నిరుద్యోగుల కోసమే. ప్రభుత్వం వెంటనే స్పందించి పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ జారీ చేయా లి. మా ఆందోళన రాజకీయం కోసం కాదని నాయకులు గుర్తించాలి.
– కైలాశ్, నిరుద్యోగి
ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా విడుదల చేయడంతో కనీస వయస్సు అర్హత కోల్పోతున్నాం. ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలబడి, కనీస వయస్సు 36 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలుగా నిర్ణయించాలి.
-మధు, నిరుద్యోగి