నిజామాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలని, మెగా డీఎస్పీ వేయాలని, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు తదితర డిమాండ్లతో నిరుద్యోగులు చేపట్టిన ఉద్యమంపై సర్కారు ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునివ్వగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి యువత రాజధానికి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకున్నది. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.
కొంతకాలంగా రేవంత్‌రెడ్డి సర్కారుపై నిప్పులు చెరుగుతున్న నిరుద్యోగ లోకం శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయ ముట్టడికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా నుంచి భారీగా యువత కదం తొక్కేందుకు సిద్ధమవ్వగా ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిచి వేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అర్ధరాత్రి నుంచే విద్యార్థి సంఘాల నాయకులు, పలువు రు నిరుద్యోగుల ఇండ్లకు పోలీసులు వెళ్లి వారిని వెంబడించి అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో పోలీసులు భయానక పరిస్థితిని సృష్టించారు. ప్రజాస్వామ్యయుతమైన మన దేశంలో నిరసనలు తెలపడం ప్రతి పౌరుడి హక్కు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం ఉక్కుపాదంతో నిరసనలను అణిచి వేస్తుండడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది.
హామీల అమలు కోసం ఉద్యమబాట..
ఎన్నికలకు ముందు సవ్యంగా చదువుకుంటున్న వారందరినీ రోడ్లపైకి తీసుకు వచ్చి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఆం దోళనలు చేయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్రూప్ -1, 2, 3 పోస్టులను పెంచుతామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి నియామకాలను నిరంతర ప్రక్రియ మాదిరిగా నిర్వహిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించారు. గద్దెనెక్కిన తర్వాత యువతను పట్టించుకోవడం మానేశారు. గ్రూప్ -1లో నామమాత్రంగా పోస్టులను పెంచి ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. గ్రూప్- 2, 3 లో పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతున్నా స్పందన కరువైంది. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో 1ః100 నిష్పత్తిలో మె యిన్స్‌కు అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గతేడాది గ్రూప్ -1 ప్రిలిమ్స్ రద్దు కాక ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలంతా 1ః100 నిష్పత్తిలో ఫలితాలివ్వాలని కోరడం గమనార్హం.
నిరుద్యోగుల్లో ఆందోళన..
కేసీఆర్ సర్కారు హయాంలో నిర్వహించిన గురుకుల నియామకాలకు, నర్సింగ్ స్టాఫ్, పోలీస్ నియామకాలకు సంబంధించిన ఫలితాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపడితే నియామక పత్రాలిచ్చి అంతా తామే చేశామంటూ కాంగ్రెస్ చెప్పుకుంటోంది. మరోవైపు గ్రూప్ -4 ఫలితాలు వెలువడగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతోంది. కొత్తగా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోగా..టెట్ మాత్రమే ఈ ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటాలతో రాబోయే రెండు, మూడు నెలల్లో నిర్వహించే గ్రూప్ -2, 3 పరీక్షలు ఉంటాయా? ఉండవా? అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని యువత కోరుతుండడంతో టీజీపీఎస్సీ మాత్రం ససేమిరా అంటోంది.
నిజామాబాద్ జిల్లాలో 80 మంది అరెస్టు
టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి వెళ్లే విద్యార్థి సం ఘాల నాయకులు, నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడుకున్నారు. అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో పోలీసులు శుక్రవారం తెల్లవారు జాము నుంచి అరెస్టులు మొదలు పెట్టారు. ఇండ్ల వద్ద నిఘా ఉంచి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు 80 మందిని ముందస్తుగా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అనంతరం వారిని మధ్యాహ్నం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
అరెస్టు చేయడం సరికాదు..
మెగా డీఎస్పీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన బీజేవైఎం నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసి ఆర్మూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారికి బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ మాట్లాడుతూ.. బీజేవైఎం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపునిచ్చామని, ఈ నేపథ్యంలో నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అరెస్ట్ చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కలిగోట్ గంగాధర్, ప్రశాంత్, నాయకులు ఉన్నారు.
అక్రమంగా అరెస్టు చేశారు..
ఎల్లమ్మగుట్టలోని మా నివాసంలో ఉంటు న్న మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అడిగితే అక్రమంగా అరెస్టు చేయిస్తారా. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల పేరిట లక్షలు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదు. మెగా డీఎస్సీ ప్రకటించి 24వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
-రాకేశ్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
హామీలను వెంటనే నెరవేర్చాలి
ఖలీల్‌వాడి, జూలై 5: ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. గ్రూప్‌లో పోస్టుల సంఖ్య పెంచాలి. విద్యారంగా సమస్యలను పరిష్కరించాలి.
– సునీల్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్