తెలంగాణ సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. గమ్యాన్ని ముద్దాడింది. సమైక్య కుట్రలకు ఎదురొడ్డి, సబ్బండ వర్గాలను ఏకం చేసి స్వరాష్ర్టాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్రకెక్కింది. తెలంగాణ సాధన కోసం 2001లో ఒంటరిగా బయల్దేరిన కేసీఆర్కు ఇందూరు గడ్డ అండగా నిలబడింది. టీఆర్ఎస్ను అక్కున చేర్చుకొని అద్వితీయ విజయాలను అందించింది. ఆనాటి నుంచి నేటి వరకూ గులాబీ పార్టీకి ఉమ్మడి జిల్లా కంచుకోటగా నిలబడింది. సమైక్య పాలన, స్వరాష్ట్రంలోనూ ‘కారు’ జోరుకు అడ్డే లేకుండా పోయింది. అయితే, దేశ రాజకీయ యవనికపై శూన్యత ఏర్పడడం, విభజన, విద్వేష రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. సంక్షోభంలో చిక్కుకున్న భారతావనిని మేల్కొలిపేందుకు, దేశాన్ని సంక్షేమబాటలో నడిపేందుకు జాతీయ రాజకీయాల వైపు ప్రయాణం ప్రారంభించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. భారతావని బాగు కోసం బయల్దేరిన బీఆర్ఎస్ పార్టీకి ఇందూరు ప్రజలు మరోమారు మద్దతుగా నిలుస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని ప్రతిన బూనారు.
కమ్మర్పల్లి, డిసెంబర్ 9 : ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘన చరిత్రను లిఖించింది. స్వరాష్ట్ర సాధనోద్యమంలో టీఆర్ఎస్కు ఆదిలోనే ఊపిరిలూదడంలో కీలకంగా నిలిచిన చరిత్ర ఇందూరు గడ్డది. సుదీర్ఘ కాలం పాటు జిల్లా రాజకీయాలను శాసించిన జాతీయ, సీమాంధ్ర పార్టీలకు తొలినాళ్లలోనే ఎదురొడ్డి నిలబడిన ఘనత నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ది. మలి దశ ఉద్యమ కార్యక్రమాలతో ఉవ్వెత్తున ఎగిసి 21 ఏండ్ల ప్రస్థానంలో జిల్లాలో చట్ట సభల ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి బీఆర్ఎస్గా మరో చరిత్రలోకి అడుగు పెట్టింది.
తెలంగాణలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి వివక్షపూరిత పాలకుల ఆగడాలను ఎండ గట్టింది. రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా కేసీఆర్ నాయకత్వంలో అనతి కాలంలోనే తెలంగాణ ప్రజలు తమ ఇంటి పార్టీగా.. ఆత్మ గౌరవం కోసం, భావి తరాల కోసం పుట్టిన పార్టీగా భావించే స్థాయికి ఎదిగింది. ప్రజలతో మమేకమవుతూ రాష్ట్ర సాధన కోసం మహత్తర ఉద్యమాలను సాగించింది. రాష్ట్ర సాధనకు రాజకీయ శక్తి సైతం అవసరమని గుర్తించి ఎన్నికల్లో నిలిచి విజయాలను సాధించింది. తొలినాళ్లలోనే విజయాల్లో నిజామాబాద్ జిల్లా ఘనమైన పాత్ర వహించింది. 2001 ఏప్రిల్ 27న జల దృశ్యంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కొన్ని నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. తొలి ఎన్నికల్లోనే టీఆర్ఎస్ పార్టీకి తొలి జడ్పీ చైర్మన్ అందించిన నిజామాబాద్ జిల్లా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ తరువాతి విజయాలకు నాందిగా నిలిచింది.
ఉమ్మడి రాష్ట్రంలో 2004లో జరిగిన శాసన సభా ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. 2004లో తెలంగాణ వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు సాధించింది. ఈ విజయ పరంపరలో నిజామాబాద్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నది. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో టీఆర్ఎస్ తిరుగు లేని ప్రజాదరణ పొంది ఐదింటికి ఐదు స్థానాల్లో విజయ బావుటా ఎగుర వేసింది. స్వరాష్ట్రం సాధించుకున్నాక జిల్లాలో ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పెద్ద ఎత్తు న అభివృద్ధి, కేసీఆర్ మానవీయ పాలనను అందించిన అధికార పార్టీగా నిలిచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జిల్లాలో మరో సారి ఐదింటికి ఐదు స్థానాలను సొంతం చేసుకున్నది.
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పయనం.. ఉద్య మం, అభివృద్ధి మేళవింపుతో సాగింది. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సారథ్యంలో ఉద్యమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నది జిల్లా ప్రజానీకం. జిల్లాలో బాల్కొండ నియోజక వర్గంలో వేల్పూర్ మండలం మోతె ప్రజల ఉద్యమ స్ఫూర్తితో మోతె మట్టిని కేసీఆర్ ముడుపు కట్టారు. బోధన్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం నిర్వహించిన తెలంగాణ దీక్షా శిబిరాలు, ఆర్మూర్లో టీఆర్ఎస్ ప్లీనరీ, కేసీఆర్ ఎస్సారెస్పీని సందర్శించి తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు శివాలయాల్లా ఉన్నాయని సీమాంధ్ర పాలకుల వివక్షను ఎండ గట్టడం, జిల్లా కేంద్రంలో కేసీఆర్ పాల్గొన్న ఉద్యమ సభలు, బీడీ కార్మికులకు జీవన భృతి పథకాన్ని మోర్తాడ్ కేంద్రంగా కేసీఆర్ ప్రకటించడం.. ఇలా ఎన్నో ఉద్యమ కార్యక్రమాలతో ఉవ్వెత్తున ఎగిసిన టీఆర్ఎస్.. 2014 తర్వాత అధికార పార్టీగా జిల్లాకు విశేషమైన అభివృద్ధి కార్యక్రమాలను అందించింది.
సాగునీటి రంగంలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, వరద కాలువను మూడు కాలాలు నిండుకుండలా మార్చడం, ప్యాకేజీ 21 పథకం, జిల్లాలో వైద సౌకర్యాలను మెరుగు పర్చడం, కొత్త మండలాల ఏర్పాటు, నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం, సర్కారు దవాఖానల అభివృద్ధి, పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, నూతనంగా వంతెనలు నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు, దేవాలయాలు, చర్చీలు, మసీదుల అభివృద్ధి తదితర కార్యక్రమాలెన్నో అందించి జిల్లాను అబివృద్ధి పథంలో నిలిపిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారి జిల్లాలో మరో చరిత్రలోకి అడుగు పెడుతున్నది.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, కేంద్రం పెత్తనంపై పోరాటం, తెలంగాణ తరహా అభివృద్ధిని దేశమంతటా అందించడం కోసం సీఎం కేసీఆర్ పూరించిన శంఖారావం బీఆర్ఎస్.. ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ లాగే దేశమంతా విప్లవాత్మక మార్పులు సాధిస్తుందని, ఇందూరు జిల్లాలోనూ నూతనాధ్యాయం లిఖించడం ఖాయమని జిల్లా వాసుల్లో సంతోషం, విశ్వాసం వ్యక్తమవుతున్నాయి.