సమయం అర్ధరాత్రి 12.20 గంటలు.. స్థలం మోర్తాడ్ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాయల్ హోటల్. జాతీయ రహదారిపై రెండు పోలీసు వాహనాలుగస్తీ కాస్తున్నాయి. వాటి ముందర నుంచే ఇసుక ట్రాక్టర్లు జోరుగా పరుగులు పెడుతున్నాయి.నిశీధిలో తమ కళ్ల ముందే సాగుతున్న ఇసుక దందాను పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఒక విధంగా సహజ సంపద దోపిడీకి కాపలాకాస్తున్నారు!. అధికార పార్టీ నేతలు ఇసుకను ఎలా కొల్లగొడుతున్నారో, అధికారులు, పోలీసులు వారికి ఎలా వత్తాసు పలుకుతున్నారో చెప్పేందుకు చక్కటి నిదర్శనమే ఈ ఉదంతం.
మోర్తాడ్, డిసెంబర్ 12 : బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. యంత్రాంగాన్ని గుప్పిట పట్టిన అధికార పార్టీ నేతలు ఏమాత్రం తొణకడం లేదు. ఎవరొచ్చినా ఏం చేస్తారనే ధీమాతో రెచ్చిపోతున్నారు. నిశీధిలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతున్నారు. గ్రామ కమిటీలకు, అధికారులకు లక్షల రూపాయలను ఎరగా వేసి సహజ సంపదను దోచుకుంటున్నారు. అక్రమార్కులకు కళ్లెం వేయాల్సిన పోలీసులు, ఇసుక దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు కిమ్మనడం లేదు. పైగా ఇసుకాసురులకు వంత పాడుతుండడం విస్మయానికి గురి చేస్తున్నది. కండ్ల ముందే ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్నా పోలీసులు ఆపడం లేదు సరికదా వాటికి కాపలా కాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, పెద్దవాగులో రోడ్డు వేసి జేసీబీతో ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు కండ్లు మూసుకున్నారు. ఇదేమిటి సారు అని ఎవరైనా అడిగితే ‘అలాగా. మా దృష్టికి రాలేదు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని’ పాత పాటే పాడుతున్నారు.
అందరూ కూడబలుక్కుని..
వాస్తవానికి గాండ్లపేట శివారులోని పెద్దవాగులోకి వెళ్తే అక్కడేం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. మొరంతో రోడ్డు వేసి, పొక్లెయిన్‌తో ఇసుకను తోడిన ఆనవాళ్లు కనబడుతూనే ఉన్నాయి. అయినా రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లడం లేదు. నిశీధిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారుల వివరణ అడిగితే.. ఆ విషయం అక్రమార్కులకు చేరిపోవడాన్ని బట్టి అందరూ కూడబలుక్కున్నట్లే అర్థమవుతున్నది. రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటున్న రెండు ప్రధాన శాఖల అధికారులు దగ్గరుండి ఇసుకాసురులకు సహకరిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. బుధవారం రాత్రి సైతం నాలుగు గంటలకు పైగా అక్రమార్కులు ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత అధికారుల సూచన మేరకు ఆపేసినట్లు తెలిసింది.
కదలని అధికారులు..
గాండ్ల పేట శివారులోని పెద్దవాగు నుంచి అర్ధరాత్రి ఇసుక తరలింపు వ్యవహారం జోరుగా సాగుతున్నది. రాత్రి 10 దాటిన తర్వాత జేసీబీలు, ట్రాక్టర్లు వాగులోకి చొరబడుతున్నాయి. తెల్లవారుజాము వరకూ వందల ట్రిప్పుల ఇసుకను తరలించుకు పోతున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమ దందాకు రెవెన్యూ, పోలీసు శాఖలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా క్షేత్ర స్థాయి నుంచి డివిజన్, జిల్లా స్థాయి వరకూ అందరికీ ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై ఈ నెల 10న ‘పెద్దవాగును తవ్వేస్తున్నారు’ శీర్షికన నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించింది. అయినప్పటికీ అధికారులు స్పందించక పోవడం.. ఇసుకాసురులతో పెనవేసుకున్న బంధాన్ని తేటతెల్లం చేస్తున్నది.
రూ.లక్షల్లో ముడుపులు..
పెద్దవాగు నుంచి ఇసుక తరలింపునకు అక్రమార్కులు నోట్ల కట్టలను ఎర వేస్తున్నారు. గ్రామ కమిటీలు, అధికారులకు రూ.లక్షలు ముట్టజెప్పి సహజ సంపదను దోచుకుంటున్నారు. పెద్దవాగులో ఇసుక తవ్వుకోవడానికి గాండ్లపేట గ్రామకమిటీకి రూ.18 లక్షలు చెల్లించారు. మరోవైపు, మోర్తాడ్ శివారులో ఇసుక తవ్వినందుకు గాను మోర్తాడ్ వీడీసీ సభ్యులు రూ.5 లక్షల జరిమానా విధించినా బుద్ధి మార్చుకోలేదు. పైగా మరింత రెచ్చిపోయి ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఇక, అధికారులకు సైతం పెద్ద మొత్తంలో ముట్టజెబుతున్నారు. మండల స్థాయి అధికారులతో పాటు సర్కిల్, డివిజన్ స్థాయి అధికారులకూ రూ.లక్షల కొద్దీ డబ్బులు వెదజల్లుతున్నారని తెలిసింది. అందుకే ఆయా శాఖల అధికారులు ఇసుక దందా వైపు కన్నెత్తి చూడడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తహసీల్ ఆఫీస్‌కు సమీపంలోనే..
మోర్తాడ్ శివారులోని జాతీయరహదారి పక్కనే లెక్కలేనన్ని ఇసుక డంప్‌లు ఉన్నా కనిపించడం లేదు. పైగా తహసీల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇసుకను డంప్ చేస్తున్నా రెవెన్యూ అధికారుల కండ్లకు కనబడడం లేదు. గాండ్లపేట్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఇక్కడ డంప్ చేసి, లారీల్లో పట్టణాలకు తరలిస్తున్నారు. రోజుల తరబడి ఇక్కడే ఉంటున్నా వీటి గురించి ఎవరూ పట్టించుకోరు. అధికార పార్టీకి చెందిన నాయకులే ఇసుక దోపిడీకి పాల్పడుతుండడం, అధికారులకు భారీగా ముడుపులు చెల్లించడమే కారణన్న ఆరోపణలు ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ దందా జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు సైతం కిమ్మనక పోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇసుక అక్రమ రవాణా విషయంలో ఆందోళనలు చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయంటే అధికారులు ఎంత ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారో స్పష్టమవుతున్నది.